వరంగల్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ పూరించిన సమరశంఖంతో ఊరూవాడా నిద్రలేచింది. రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజావ్యతిరేకత తీవ్రరూపం దాల్చింది. ఒకవైపు 22-ఏ నిషేధిత జాబితా గొడవ, ఉద్యోగుల ఆందోళన, మరోవైపు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసంపై నిరుద్యోగుల నిరసనలు, అనాలోచితంగా తెచ్చిన జీవో రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల రగడ, పుండుమీద కారం చల్లినట్టుగా పొంచిఉన్న వ్యవసాయ సంక్షోభం, తాజాగా బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం.. ఇలా రాష్ట్రంలో అన్ని రంగాల నుంచి వ్యక్తమవుతున్న ప్రజావ్యతిరేకత నుంచి ఎట్లా బయటపడాలి? అని కాంగ్రెస్ సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. నీళ్లు ఉన్నా ఇవ్వని ప్రభుత్వ అసమర్థతను నిగ్గుతేల్చేందుకు లక్షలాది మంది రైతులతో కలిసి వస్తానన్న కేసీఆర్ హెచ్చరికతో సీఎం రేవంత్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎప్పటిమాదిరిగానే ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ డ్రామా మొదలుపెట్టారు. అందులో భాగమే సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలు.
ప్రభుత్వంగా కాంగ్రెస్, సారథిగా రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ఎండగడుతున్నారన్న అక్కసుతోనే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై అసెంబ్లీ సాక్షిగా ముష్టిఘాతాలకు తెగబడ్డారనేది సుస్పష్టం. విపక్షం అడిగే ప్రశ్నలకు, లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పలేక.. వారిని సభలోకే రానీయకుండా చేసిన తీరుపై విమర్శలొస్తున్నాయి. ‘ఎన్నిరోజులైనా సరే సభ నిర్వహిస్తాం. సభకు రావాలి, అక్కడే తేల్చుకుందాం’ అంటూ బహిరంగ వేదికల్లో భీకర ప్రకటనలు చేసే సీఎం రేవంత్‌రెడ్డి, తీరా విపక్ష సభ్యులను సభకే రాకుండా అడ్డుకోవటం దారుణం. సాధారణంగా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు మర్యాదగానే ఉంటారు. కానీ, సోమవారం వారి విపరీత చేష్టలను బట్టి చూస్తే.. మునుపెన్నడూ లేనిరీతిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈసారి పోలీసులకు ‘దాడి’ ఆదేశాలు ఇచ్చిందని, అందులో భాగంగానే వారు ఎమ్మెల్యేలపై రెచ్చిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద అంశం తెరపైకి వచ్చి, ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టిని మరల్చే చర్యలకు దిగడం మొదటినుంచీ జరుగుతున్నదే. గతం లో రుణమాఫీపై రైతులు ఊరూరా రణగీతం ఆలపించినప్పుడు, వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోయినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఇతర అంశాలను తెరమీదికి తెచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నా.. ఎగువ రాష్ర్టాల్లో కురిసిన వర్షాలతో గోదావరి, కృష్ణా జలాల్లో పుష్కలమైన నీరున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లను ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు సహా రైతుల ముందు ఉంచింది.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వమే దళారీగా మారి, తమ కోసం, తమ అనుయాయుల కోసం వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని 22-ఏ పేరుతో నిషేధిత జాబితాలో చేర్చడంపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అన్ని రంగాలు, అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాగ్రహాన్ని ప్రతిఫలించేలా సభలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో తమ దగ్గర సమాధానాలు లేకపోవడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని, అందుకే డైవర్షన్ డ్రామాను ఆశ్రయించిందని భావిస్తున్నారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలు విజయవంతం అవుతున్నాయి. తమ పాలనపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉన్నదని కాంగ్రెస్ గుర్తించింది. సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలతో మరింత చులకన అవుతున్నామని అధిష్ఠానం విశ్వసిస్తున్నది. కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం అంతర్గతంగా తీవ్ర దుమారాన్నే రేపుతున్నదట. బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిని తప్పించడం, అదీ ఒక బీసీ మహిళపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి డ్యామేజీగా మారింది.
దీనికితోడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ తెలంగాణ కోసం బలమైన గొంతుకగా నినదించిన మాజీ మంత్రి చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించడం తీవ్ర దుమారం రేపుతున్నది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందన రాలేదు. ఈ వరుస పరిణామాల నుంచి తక్షణం బయటపడాలంటే విపక్షసభ్యులను సభకు రాకుండా నిరోధించడమే ఏకైక మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించి, పోలీసులను ఉసిగొలిపిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్ వద్ద పోలీసులు సోమవారం ఓవరాక్షన్ చేశారు. అసెంబ్లీ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తెలంగాణభవన్‌కు తరలించారు. అక్కడే చీకటిపడే దాకా మోహరించారు. ఎమ్మెల్యేలు అక్కడినుంచి నిమ్స్ దవాఖానకు చికిత్స కోసం వెళ్తుండగా పోలీసులు తెలంగాణభవన్ గేటు వద్ద అడ్డుకున్నారు.