ఒక పాలకుడిని మొదట కొంతకాలం గమనిస్తాం. అపుడు ఒక అభిప్రాయానికి వస్తాం. తర్వాత మరికొంత చూస్తాం. ఆ అభిప్రాయం ఆ మీదట స్థిరపడుతుంది. అప్పుడది ఎన్నాళ్లయినా మారటం కష్టం. అరుదుగా తప్ప. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విషయం అట్లానే ఉన్నది. ఆయన తన గోయి తాను తవ్వుకోవటం అధికారానికి వచ్చి ఆరు నెలలు తిరిగేసరికి మొదలైంది. అట్లా తవ్వుకోవటం మరొక ఆరు నెలలకు స్థిరపడింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటికి 33 నెలలు గడిచిన తర్వాత ఇక అందులో మార్పు ఉండని దశ వచ్చి వేసింది. సూటిగా చెప్పాలంటే, ఆయన రాజకీయంగా తన గోయి తాను తవ్వుకోవటం పూర్తవుతున్నదన్నమాట.
రేవంత్‌రెడ్డి ఈ 33 నెలల కాలంలో ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని ఉంటే, ఈ స్థితిలో మార్పు తప్పక సాధ్యమయ్యేది. కానీ ఆయన స్వయంగా అర్థం చేసుకోకపోవటమే గాక, ఎవరెన్ని సూచనలు చేసినా మారలేదు. అదుపు చేయగలిగిన ఏఐసీసీ నాయకత్వం ఆ ప్రయత్నం ఎంత వరకు చేసిందన్నది తెలియదు. పైకి మాత్రం ఏమీ కనిపించలేదు. ఇక్కడి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గానీ, పార్టీ ఇతర సీనియర్ నాయకులు గానీ చేసింది శూన్యం. పీసీసీ అధ్యక్షుడు స్వతహాగా మంచివాడు, అనుభవజ్ఞుడు, పార్టీ మేలును కోరుకునేవాడే. కానీ రేవంత్‌రెడ్డి సాంగత్యంలో సహవాస దోషం బాగా అబ్బిపోయింది. గాంధీ కుటుంబం ఎందుకు దారిన పెట్టడంలేదు, లేదా పెట్టలేకపోతున్నదనే చర్చ చాలానే జరిగింది గనుక ఇప్పుడు మళ్లీ చెప్పుకోనక్కరలేదు.
ఇక మిగిలింది పార్టీ శ్రేణుల అభిప్రాయం, ప్రజాభిప్రాయం. కాంగ్రెస్‌లో పార్టీ శ్రేణులన్నవి ఒకప్పటివలె లేవు. చాలా మారిపోయాయి. వారికి గతంలో పార్టీ అధికారానికి రావడం ఎంత ముఖ్యమో, పార్టీ ఆశయాలకు, మంచి పరిపాలనకు కట్టుబడటం అంత ముఖ్యంగా తోచేది. కానీ 20వ శతాబ్దం గడిచి 21వ శతాబ్దం వచ్చినా కొద్దీ, కొత్త తరాలు ప్రవేశించినా కొద్దీ, ఆర్థిక సంస్కరణల (1990ల నుంచి) ఫలితంగా సంపదలు, ఆకర్షణలు పెరిగిన కొద్దీ మార్పులు రాసాగాయి. పార్టీ ఆశయాలు, మంచి పరిపాలన అనేవి అస్సలు లేకుండా పోయాయి. అధికారంలోకి రావడం, దాని ఫలితాలను అనుభవించడమే సర్వస్వంగా మారాయి. ఢిల్లీ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు, ఇతరత్రా సీనియర్ నాయకుల వరకు కూడా ఇదే మూసలో తయారవుతుండటంతో, పార్టీ శ్రేణులకు సైతం సహజంగానే అదే ఒక ఆదర్శంగా మారింది. లోగడ కొంత పెద్ద మనుషుల వలె ఉండిన సీనియర్ నాయకులు రిటైర్మెంట్ వానప్రస్థాశ్రమంలోకి వెళ్తూ, తమ వారసులకు అవకాశాలను సంపాదించే ఆత్రుతలో పడి, జరుగుతున్న దానిపట్ల తామూ మిన్నకుంటున్నారు.
ప్రజాభిప్రాయం విషయానికి వస్తే, 33 నెలల్లో మొదటి ఆరు నెలలను తీసివేస్తే తర్వాత 27 నెలలుగా అది ఏ విధంగా ఏర్పడి స్థిరపడుతూ వస్తున్నదో అందరికీ కనిపిస్తున్నదే. వాస్తవానికి పాలకులు మరి దేనిని కాకపోయినా కనీసం ప్రజాభిప్రాయాన్ని అయినా లెక్క చేయాలి. దానిని బట్టి అవసరమైన మార్పులు చేసుకోవాలి. తిరిగి అధికారానికి రావాలని కోరుకుంటారు గనుక. ఓట్ల కొనుగోలు ఎంత చేసినా అది ఒక్కటే గెలిపించలేదు గనుక. ఓటర్లలో తగినంత మంది పైసలు తీసుకుని కూడా తమకు నచ్చిన వారికి ఓటు వేసే ధోరణి పెరుగుతున్నది గనుక. అందువల్ల ప్రజాభిప్రాయమన్నది పూర్తిగా ఉపేక్షించగలది కాదు.
అయినప్పటికీ, పైన పేర్కొన్న అన్నింటినీ లెక్కచేయని రాజకీయ తరగతి ఒకటి తయారవుతున్నది. వారి ప్రణాళిక అధికారంలో ఉన్నంత కాలం విచ్చలవిడిగా సంపాదించడం. తిరిగి గెలువకపోతే గెలిచిన పార్టీలో చేరడం. ఇప్పటి పార్టీ మరెప్పుడైనా గెలిస్తే మళ్లీ అందులోకి రావడం. ఈ విధంగా వీళ్లు పోవడాలు, ఇతర పార్టీలు రానివ్వడాలు అన్నది ఒక స్వేచ్ఛా వాణిజ్య ధోరణిగా మారడం కూడా ఈ 21వ శతాబ్దం నుంచి విస్తరించడం మొదలైంది. విశేషం ఏమంటే, ఎంతో సైద్ధాంతికం, సంప్రదాయికం, నియమబద్ధం, నీతిబద్ధం అని చాటిచెప్పుకునే బీజేపీ సైతం నరేంద్రమోదీ, అమిత్‌షాల శకం మొదలైన తర్వాత అందుకు మినహాయింపు కాకుండా పోయింది. కాంగ్రెస్‌ను మించి కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇతర పార్టీల కన్నా వారి వద్ద డబ్బు అనేక రెట్లు. దర్యాప్తు ఏజెన్సీలతో బెదిరించి అవతలివారిని తమ బందెలదొడ్డిలోకి తోలుకోవడం కూడా అందుకొక ఉదాహరణ. పరిస్థితి సోకాల్డ్ సైద్ధాంతిక పార్టీలో ఇది కాగా, ఆ ధోరణిని మాతృ సైద్ధాంతిక సంస్థ సంఘ్ పరివార్ ఆశీర్వదిస్తుండగా, ఇక కాంగ్రెస్ వంటి మధ్యేమార్గ పార్టీ గురించి చెప్పేదేమున్నది. అనగా, మహత్తర భారతదేశపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ ఒక మురికి ఊబిలోకి దిగబడుతున్నదన్నమాట. దేశ రాజకీయ తరగతి కుక్కమూతి పిందెల తరంలోకి ప్రవేశించింది.
ఈ దోషం మాత్రం నూటికి వెయ్యిశాతం రాజకీయ పార్టీలది, రాజకీయ తరగతిది, రాజకీయ నాయకులదే తప్ప ప్రజలది కాదు. ఈ వి ధంగా మురికి ఊబిలోకి దిగబడిన వ్యవస్థ సంతానమే లేదా ఆ సంతానంలో ఒకరు రేవంత్‌రెడ్డి. ఇంగ్లిష్‌లో ‘ద మ్యాన్ అండ్ హిజ్ టైమ్స్’ అనే సూత్రీకరణ ఒకటున్నది. దాని అర్థం, ఒక వ్యక్తి తన సమకాలీన పరిస్థితుల ప్రభావాలతో అందుకు అనుగుణంగా రూపుదిద్దుకుంటాడని. ఆ ప్రభావాలను ఛేదించి భిన్నంగా మెరుగుగా రూపుదిద్దుకునే వారూ ఉంటారు. కానీ అరుదుగా. రేవంత్‌రెడ్డిది అటువంటి అరుదైన వ్యక్తిత్వం కాదు. నిజంగా మాట్లాడుకోవాలంటే, ఆయన వ్యక్తిత్వం తను దిగబడుతున్న మురికి ఊబిని మరింత చిక్కన చేస్తున్నది. ఈ స్థితికి మినహాయింపులు తక్కువగా మాత్రమే కనిపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి వంటి వారు ఆ స్థితికి నిక్కమైన ఉదాహరణలు. ఈ విధంగా భావించటానికి కారణం ఆయన పరిపాలన ఒక్కటేకాదు. వాస్తవానికి కేవలం పరిపాలన దృష్ట్యా ఆ మాట అననక్కరలేదు. ఎవరు కూడా నూటికి నూరుశాతం విజయవంతంగా పాలించలేదు. ప్రజలను పూర్తిగా మెప్పించలేరు. అయితే ప్రజలు వారి నుంచి కనీసం తగిన స్థాయిలో మంచి పాలనతోపాటు, అంతకన్నా ముఖ్యంగా గౌరవనీయమైన ప్రవర్తన, భాష, వ్యవహారశైలిని ఆశిస్తారు. తమ పాలకుడిని చూసి తాము సిగ్గుపడే స్థితిని కోరుకోరు.
ఆరు నెలలు గడిచి ఇపుడు 33 నెలలు కూడా అయ్యేసరికి అటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ముందు ఆరు గ్యారెంటీలకు తామే పెట్టిన 100 రోజుల గడువు పూర్తయినా, ప్రజలు సాధారణంగా మంచివారు, ఉదార స్వభావులు అయినందున మరికొంత కాలం చూద్దామనుకున్నారు. కానీ తర్వాత జరుగుతూ వస్తున్నదేమిటో అందరూ చూస్తున్నదే.
హామీల అమలు, అభివృద్ధి, పరిపాలన, పేదలపై దౌర్జన్యాలు, ప్రాజెక్టుల పేరిట భూములూ స్థలాలను గుంజుకోవటం, విచ్చలవిడి అవినీతి, నేరాల పెరుగుదల, పోలీసుల వ్యవహారశైలి వంటివి ఒకవైపు కనిపిస్తుండగా, మరొకవైపు రేవంత్‌రెడ్డి భాష, హీన సంస్కారం, తనతో స్ఫూర్తి పొందిన కొందరు ఇతర కాంగ్రెస్ వాదుల భాష వంటివన్నీ రేవంత్‌రెడ్డి గోతినేకాదు, ఆయన పార్టీ గోతిని కూడా తవ్వుతున్నాయి. కొంతకాలం కొద్దికొద్దిగా సాగిన ఆ తవ్వకం క్రమంగా వేగాన్ని అందుకుంటున్నది.
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల పరిణామాలతో ఆరంభించి పరాకాష్ట మార్గాన్ని పట్టింది. ఆ రోజులతో మొదలైన వికృత చేష్టలు, కేసీఆర్‌పై కక్షను తీర్చుకునేందుకు ఎర్రవల్లి దళిత రైతులను దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల నుంచి వెళ్లగొట్టే పన్నాగాల వరకు దిగజారాయి. అవి ఇందిరాగాంధీ కాలంలో ఇచ్చిన భూములన్నది కూడా రేవంత్‌రెడ్డి లెక్కచేయడంలేదు. తమ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్టు అర్థమైనాకొద్దీ, పద్ధతులను మార్చుకునే వివేకానికి బదులు, మరింత రెచ్చిపోయే అవివేకాన్ని ప్రదర్శిస్తున్నారు ఆయన. ఇందులో ఆశ్చర్యంలేదు. పైన చెప్పుకొన్న విధంగా పరిపరి విధాల పతనమవుతున్నవారు ఈ విధంగా వ్యవహరించడమే తార్కిక పరిణామం అవుతుంది. గోయి తవ్వకం ఆ విధంగా సంపూర్ణమవుతుంది.
హామీల అమలు, అభివృద్ధి, పరిపాలన, పేదలపై దౌర్జన్యాలు, ప్రాజెక్టుల పేరిట భూములూ స్థలాలను గుంజుకోవటం, విచ్చలవిడి అవినీతి, నేరాల పెరుగుదల, పోలీసుల వ్యవహారశైలి వంటివి ఒకవైపు కనిపిస్తుండగా, మరొకవైపు రేవంత్‌రెడ్డి భాష, హీన సంస్కారం, తనతో స్ఫూర్తి పొందిన కొందరు ఇతర కాంగ్రెస్ వాదుల భాష వంటివన్నీ రేవంత్‌రెడ్డి గోతినేకాదు, ఆయన పార్టీ గోతిని కూడా తవ్వుతున్నాయి. కొంతకాలం కొద్దికొద్దిగా సాగిన ఆ తవ్వకం క్రమంగా వేగాన్ని అందుకుంటున్నది.