సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 21: వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన మార్చురీలో ఓ వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఉదంతం మీద నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తా కథనంపై స్పందించిన కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించారు. రాయపర్తి మండలానికి చెందిన గారె వీరయ్య(58) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని వర్ధన్నపేట దవాఖాన మార్చురీలో రాత్రంతా భధ్రపరిచారు.
మరుసటి రోజు ఉదయానికి ఆయన కన్ను, ఆ పై భాగంలో ఎలుకలు కొరికినట్టు గుర్తులు కనిపించాయి. ఆ మార్చురీలో ఫ్రీజర్, కోల్డ్‌స్టోరేజ్, విద్యుత్తు లేకపోవడం, పారిశుద్ధ్య లోపం, ఎలుకల బెడద ఉన్నట్టు ‘నమస్తే’ తన వార్తా కథనంలో పేర్కొంది. ఈ విషయాలు వాస్తవమని తేలితే తగిన చర్యలు తీసుకోవాలసి వస్తుందని కమిషన్ పేర్కొంది. ఆ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వరంగల్ కలెక్టర్‌ను ఆదేశించింది. మృతదేహాన్ని ఎలుకలు కొరకడానికి దారితీసిన పరిస్థితులు, నిర్వహణ లోపాలు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోనున్న జాగ్రత్తలపై నివేదిక అందించాలని పేర్కొంది. ఆ నివేదికను అక్టోబర్ 27లోగా అందించాలని ఆదేశించింది.