సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఛైర్మన్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వెళ్తున్న ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీ గేటు బయటే పోలీసులతో అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిందని, కొందరు మహిళా ఎమ్మెల్యేల పట్ల అమర్యాదగా ప్రవర్తించడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. ‘మహిళా సభ్యుల చీరలు లాగడం, జుట్టు పట్టి గుంజడం, గౌరవ సభ్యుల పట్ల వ్యవహరించే విధానం ఇదేనా.. అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల నుంచి దారి మళ్లించేందుకే కాంగ్రెస్ సరార్ ఇటువంటి అణచివేత చర్యలకు పాల్పడుతోందని నేతలు ఆరోపించారు. శానససభ ప్రాంగణంలోకి ప్రజాప్రతినిధులను వెళ్లకుండా అడ్డుకోవడం వారి హకులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్ట్ చేయించింది. రాష్ట్రంలో రైతులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రతిపక్షంగా ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్న ప్రతిపక్షం గొంతు నొకాలని చూస్తున్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలిపే ఉద్దేశంతో నల్ల టీ షర్టులు వేసుకోవద్దని పోలీసులు అభ్యంతరం చెప్పడం సరికాదు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు.
హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరతీసింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హకును కూడా కాలరాస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలు, అణచివేత ధోరణిని ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయం. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల గొంతు నొకాలని చూస్తే ఊరుకునేది లేదు. ప్రజల పక్షాన తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించిన తీరు వల్ల నేడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ప్రభుత్వ తీరుకు పరాకాష్టగా అభివర్ణించారు.
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తున్నది. ప్రతిపక్షం ఉన్నదే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను అసెంబ్లీలో ప్రజాస్వామికంగా ఎత్తిచూపడం తప్పా. సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులతో కొట్టిస్తారా? ఇష్టానుసారంగా తోసివేయడం కాంగ్రెస్ దాష్టీకానికి నిదర్శనం. మహిళా ఎమ్మెల్యేల జట్టు పట్టుకోవడం, చీర లాగి కంటనీరు పెట్టించడం దుర్మార్గం. ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు.
ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, డైవర్ట్ చేయడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేస్తే మేం కూడా హర్షిస్తాం. అంతేగానీ ప్రతిపక్షాన్ని అణిచివేస్తామంటే ఊరుకోం. ప్రజలను కూడగట్టి ఉద్యమిస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందా? అని ఎదురు చూస్తున్నారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ అధోగతి పాలు చేస్తుంది. కాంగ్రెస్ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం కౌరవ సభను తలపిస్తోంది. ప్రజల సమ్మతితో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు పనిచేయాల్సి ఉండగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆచరణీయం కాదు. జనాల సమస్యలు పరిష్కరించడం కోసం జరిగే శాసనసభ సమావేశాలకు ఎమ్మెల్యేలను అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ కుట్రదాగి ఉంది. అసలు ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఎక్కడిది. శాసనసభ, శాసన మండలి సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పోలీసులు ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవద్దని హైకోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసు డిపార్ట్మెంట్కు చెంపపెట్టులాంటిది.
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రశ్నించిన మహిళా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని, మహిళా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీసుల వాహనానికి అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రంలో ప్రజలను మాయమాటలతో కాంగ్రెస్ నేతలు మోసం చేశారని, గద్దెనెక్కాక ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోరాటాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ నేతలకు పోరాటాలు కొత్తకాదని, నిరంకుశ పాలకులపై పోరాడుతామని, ప్రజలకు న్యాయం జరిగే వరకు ఎన్ని కష్టాలైనా పడతామన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా ఎమ్మెల్యేలని చూడకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. అసెంబ్లీ గేటు వద్ద మమ్మల్ని పోలీసులు అడ్డుకొని సభ్యసమాజం తలదించుకునే విధంగా వ్యవహరించారు. సునితా లక్ష్మారెడ్డి చీర లాగారు, నా మెడ పట్టుకొని పోలీసులు లాగేశారు. జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతారా? ఇది ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీస్తారన్న భయంతో పోలీసులను అడ్డుపెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. నల్ల దస్తువులు వేసుకొని వస్తే నష్టం ఏమెచ్చింది. రాహుల్ గాంధీ నల్లటీషర్టు వేసుకొని పార్లమెంటుకు పోతే తప్పులేదు. రాహుల్‌గాంధీకి ఒక న్యాయం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక న్యాయం ఉంటుందా?. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులేదా, ప్రజల సమస్యలు ప్రస్తావిస్తే పోలీసులతో జులుం చేయిస్తారా, జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. సీఎం రేవంత్‌రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు క్షేమాపణ చెప్పాలి.
శాసనసభలోకి మమ్మల్ని పోనీయకుండా పోలీసులను అడ్డం పెట్టుకోవడం రాష్ట్రంలో ఏ స్థాయి అరాచక పాలన ఉందో స్పష్టం చేస్తోంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళికబద్దంగా స్పెషల్ టీంలు, గ్రేహౌండ్స్ బలగాలను ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులపై భౌతికదారులు చేయించారు. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను విస్మరించి, అసెంబ్లీలోనూ బయటా ప్రజలు ప్రశ్నిస్తున్నారనే ప్రస్టేషన్‌లోనే ఈ దాడులకు తెగబడ్డారు. మోదీ, ఆదానీ బొమ్మల టీ-షర్టులతో రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు వెళ్లొచ్చు కానీ, ప్రజా సమస్యలపై మేమ నల్లరంగు టీ-షర్టులు వేసుకొని అసెంబ్లీకి రాకూడదా? రేవంత్‌రెడ్డి మీరు రాజు, హిట్లర్ కాదు, ఇది ప్రజా సమస్యల వ్యవస్థ అనే విషాయాన్ని గుర్తుంచుకోండి. పోలీసుల వెనుక ఉండి మీరు చేయిస్తున్న ఈ అరాచకాలకు త్వరలోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.
అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్యామ్యస్ఫూర్తికి విరుద్ధమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలను అడ్డగించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణిచివేయడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కరించకుండా తప్పించుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం అణచివేత దోరణి ప్రదర్శిస్తుందని, ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో శిక్షతప్పదని హెచ్చరించారు.
ప్రజా సమస్యల మీద పోరాడేందుకు నల్ల టీ షర్టులతో వెళ్తే అరెస్ట్ చేస్తారా, రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్‌తో పార్లమెంట్‌కు వెళ్లలేదా.. కాంగ్రెస్ నాయకులకు ఒక రూల్, తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులకు ఒక రూల్ ఉంటుందా, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతారా.. ఇదేనా మీ ప్రజా పాలన, ఇదెక్కడి దౌర్జన్యం.. ఇది ముమ్మాటికి ఎమర్జెన్సీ పాలనే.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జీవో 22ఏ బాధితుల సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఆనాడు పార్లమెంట్లో రాహుల్‌గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు నల్ల చొక్కాలు వేసుకొని నిరసన తెలపలేదా? ఇప్పుడు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపితే అరెస్టు చేయడం ఏమిటి? ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలకు పరాకాష్ట. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా, ఎన్ని అక్రమ అరెస్టులకు పాల్పడినా మా పోరాటం ఆగదు.
‘రేవంత్ నీది ప్రజాపాలన కాదు, పాపాల భైరవుడి పాలన, ప్రజా పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలోకి వస్తే రేవంత్ పాపాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు’ అని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు బ్లాక్ డే అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై దురుసుగా, అవమానకరంగా వ్యహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా పోలీసులు మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరలాగిన, సబితమ్మ మెడలు నొక్కిన పోలీసులను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమన్నారు. ప్రశ్నించే గొంతుకులపై దౌర్జన్య కాండకు దిగారన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ దుర్మార్గం పరాకాష్టకు చేరిందన్నారు. ప్రభుత్వం గద్దె దిగే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 7: ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముందు నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటని సోమవారం ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మిలు ఓ ప్రకటనలో విమర్శించారు. మాజీ హోంమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కడం, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగుతూ మహిళా అని చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన రక్షక భటులే మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఈ రకమైన భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఎద్దేవా చేశారు. ఈ ఘటన కేవలం ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి మాత్రమే కాదని, మహిళా లోకానికి జరిగిన తీవ్ర అవమానమని వాపోయారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల భౌతిక దాడికి పాల్పడి, అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి అనుమతించకుండా పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసుల ప్రవర్తన కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీ షర్టులు వేసుకుంటే, వాటిపై స్లోగన్స్ ఉన్నాయని, తమ గొంతు నొక్కాలని చూశారు. బీఆర్ఎస్ వాదనతో ప్రభుత్వం ఇరకాటంతో పడుతుందని భావించే అడ్డుకున్నారు.

మా మహిళా నాయకులు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలను అడ్డుకుని జుట్టుపట్టి చీరలాగి అవమానించారు. ఈ ఘటనలో కేటీఆర్, హరీష్‌రావులకు కూడా గాయాలయ్యాయి. సర్కార్ ఆదేశాల మేరకే పోలీసులు తమ ప్రతాపం చూపెట్టారు. అవమానానికి గురైన మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలి. తాతా మధు అనుచిత వాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ విషయంలో తాతా మధు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని మీడియా ముఖంగానే చెప్పారు. అదే రీతిలో మహిళా ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.
నల్ల షర్ట్ ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తే అడ్డుకొని అరెస్టు చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్య పద్ధతిలో నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నల్లదుస్తులు ధరించడం కూడా నేరంగా భావించి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సరికాదు.

ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తున్నది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులను ఇలా అడ్డుకోవడం దుర్మార్గం. ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది.