హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమ షెడ్యూల్ సవరించింది. నోటీసుల జారీ, అభ్యంతరాలు, ఫిర్యాదులు దాఖలు చేసే గడువును నవంబర్ 5వ తేదీవరకు పొడిగించింది. సవరించిన వివరాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేశారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు దాఖలు చేసే గడువు పాత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉండగా, ఈ గడువును అక్టోబర్ 7వరకు పొడిగించారు. నోటీసు జారీ, ఫిర్యాదులు, అభ్యంతరాల పరిషారానికి గతంలో గడువు ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉండగా, నవంబర్ ఐదో తేదీకి సవరించారు. ఓటర్ల తుది జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్ 19 ఉండగా, ఇప్పుడు నవంబర్ 9వ తేదీకి పెంచారు.
‘సర్’ ప్రక్రియలో భాగంగా జారీ చేస్తున్న ప్రతి నోటీసును సంబంధిత ఓటరుకు బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో) స్వయంగా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఓటర్ల సందేహాలు, సమస్యలను పరిషరించేందుకు ఈఆర్వో, డీఈవో స్థాయిలో హెల్ప్డెస్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.