హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పనుల పెండింగ్ బిల్లులను 15 రోజుల్లో విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. గడువులోగా బిల్లులు మంజూరు చేయకపోతే, 16వ రోజు రాష్ట్రంలోని అన్ని బడులకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. కుటుంబాలతో కలిసి బడుల ముందే కూర్చుంటామని స్పష్టంచేశారు. సోమవారం హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని కాంట్రాక్టర్లు ముట్టడించారు. జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కాంట్రాక్టర్లు డైరెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తూ.. తమకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం కింద 9 వేల బడుల ఆధునీకరణ, కొత్త బడుల నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు వెయ్యి మందికి పైగా కాంట్రాక్టర్లకు పనులను అప్పగించింది. పనులు దాదాపు పూర్తి కావొస్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సర్కారు పనులు కదా అన్న భరోసాతో కాంట్రాక్టర్లు పనులను పూర్తిచేశారు. ఈ బిల్లులు మొత్తం రూ.1000 కోట్ల వరకు ఉంటాయి. కానీ కాంగ్రెస్ సర్కారు రూపాయి కూడా చెల్లించలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారుల చుట్టూ తిరిగినా కనికరించడంలేదని, ఇక ఆందోళనబాట పట్టాల్సిందేనని నిర్ణయించారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. బిల్లులు చెల్లించకపోతే బడులకు తాళాలేస్తామని హెచ్చరించారు.
రూ.60 లక్షల బిల్లుకుగాను ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. అప్పు చేసిన డబ్బుకు రూ.15 లక్షలు వడ్డీ అయింది. అప్పుల బాధ భరించలేక ఇల్లు అమ్ముకున్నా. అయినా అప్పు పూర్తిగా తేరలేదు. మా కింత విషమిచ్చి చంపాలంటూ నా భార్యాపిల్లలు అంటుంటే తట్టుకోలేకపోతున్నా. గతంలో పని చేయగానే పైసలొచ్చేవి. బిల్లుల కోసం సెక్రటేరియట్ చుట్టూ తిరిగి అలసిపోయిన. ఆ ఆఫీస్‌కు పో.. ఈ ఆఫీసుకు పో అని తిప్పుతున్నరు.
చాలావరకు బడుల పనులు రూ.10 లక్షలు-రూ.20 లక్షల విలువైనవే. ఇవేం భారీ లాభదాయకమైన పనులుకావు. డబ్బులు త్వరగా వస్తాయని ఆశతో పనులు చేశాం. ఏ పార్టీ ప్రభుత్వమైనా అందరి మేలు కోరాలి. కక్షపూరితంగా వ్యవహరించడమే.. ప్రజాపాలననా? చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు గుండెపోటుతో చనిపోయారు. సర్కారు స్పందించి 15 రోజుల్లో బిల్లులను మంజూరుచేయాలి.