హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీనే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని శాఖలకు వేతనాల చెల్లింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. కొందరు శాఖాధిపతులు (హెచ్వోడీలు), జిల్లా డీడీవోలు దళారులుగా మారడం, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడా సక్రమంగా అమలుకావడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ అందుబాటులో ఉన్నా, సమయానికి బిల్లులు సమర్పించకుండా కాలయాపన చేస్తూ వేలాదిమంది పేద కార్మికుల పొట్టగొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని కీలక ప్రభుత్వశాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఏ శాఖలో చూసినా పెండింగ్ జీతాల రోదనలే వినిపిస్తున్నాయి.
మాడల్ స్కూళ్లలో 7 నెలలుగా..
తెలంగాణ మాడల్ సూళ్లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాలు లేవు. విద్యాబుద్ధులు నేర్పే వ్యవస్థలోనే ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతున్నది. వరంగల్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో 4 నెలలుగా వేతనాలు అందడం లేదు. పంచాయతీరాజ్, గ్రౌండ్‌వాటర్ (హైదరాబాద్)లో మూడు నెలలుగా జీతాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. సిరిసిల్ల ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ పాలిటెక్నిక్ కాలేజీలో 8 మంది ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకు మూడు నెలలుగా నయాపైసా జీతం రాలేదు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ మెడికల్ కాలేజి, ఫారెస్ట్, లైబ్రరీ, మైనింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, బీసీ, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, సగానికిపైగా మున్సిపాలిటీలు, వ్యవసాయ మారెట్ కమిటీలు, విజయ డెయిరీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పోలీస్‌శాఖలోని ఔట్సోర్సింగ్ సిబ్బంది, జలమండలి బిల్ కలెక్టర్లు, జిల్లా కలెక్టరేట్లలోని హౌస్ కీపింగ్ సిబ్బంది, 104 డ్రైవర్లు, ఆపరేటర్లు.. ఇలా సుదీర్ఘ జాబితా అంతా పెండింగ్ వేతనాలు చెల్లించండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.
ఈఎస్ఐ, ఈపీఎఫ్ నిధుల స్వాహా
ఉద్యోగుల జీతాల నుంచి ప్రతినెల నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, ఈపీఎఫ్ నిధులను మినహాయిస్తున్న ఏజెన్సీలు, వాటిని ఖాతాల్లో జమ చేయకుండా మోసానికి పాల్పడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులకు అత్యవసర వేళల్లో ఉచిత వైద్యసేవలు అందడం లేదు. భవిష్యత్తు సామాజిక భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇది స్పష్టంగా కార్మిక చట్టాల ఉల్లంఘన, క్రిమినల్ చర్య కిందికి వస్తుంది. ప్రభుత్వం మొదటి తేదీనే ఏజెన్సీలకు నిధులు విడుదల చేస్తున్నా.. మధ్యవర్తులు వాటిని ఆపి, ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతర్ చేసిన హెచ్వోడీలు, డీడీవోలపై తక్షణమే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దోయిపుడి శ్రీధర్, దుర్గం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాడల్ సూళ్లలో ఏడు నెలలు, వరంగల్ ఈఎస్ఐలో నాలు నెలలు సహా అన్ని శాఖల్లోని పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మధ్యవర్తిత్వ ఏజెన్సీల వ్యవస్థను పూర్తిగా సమీక్షించి, ప్రభుత్వమే నేరుగా ట్రెజరీ/బ్యాంక్ ఖాతాల ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లించే శాశ్వత విధానాన్ని తీసుకురావాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏజెన్సీల ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లింపులపై ప్రత్యేక విచారణ జరిపి సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు.
మహా ఆందోళన తప్పదు
రాష్ట్ర పరిపాలనలో కీలక భూమిక పోషిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా, కనీస హకులను కాలరాస్తూ వెట్టిచాకిరీ చేయించడం అమానవీయం. ముఖ్యమంత్రి ఆశయాలకు గండికొడుతున్న అధికారుల నిర్లక్ష్యాన్ని సహించకూడదు. తక్షణమే స్పందించి సమస్యను పరిషరించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఏకంచేసి భారీఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడుతాం.
– తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నేతలు
చెప్పడం కాదు.. అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ప్రతినెలా మొదటి తేదీన జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం చేసుకొంటున్నారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా మోసం చేస్తున్న ఏజెన్సీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వం హామీలు ఇవ్వడం కాదు, వాటిని అమలు చేయాలి. పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలి.
– దేవీప్రసాద్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్