హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే అధికారం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పార్టీకి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారని, రాబోయే శాసనసభ ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గురువారం ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలను సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలందరికీ శిరసు వంచి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రజలను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపును కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. అనంతరం నేతలు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సెల్యూట్ తెలంగాణ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ప్రస్తుతం రాజాసింగ్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే అలక వీడకపోవడం వల్లే మహారాష్ట్రలో ఉండిపోయారని పలువురు చెప్పుకుంటున్నారు.