NIRF | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ఇచ్చే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు వెనుకబడ్డాయి. చారిత్రక ఉస్మానియా వర్సిటీ, సాంకేతిక విద్యలో దేశంలోనే తొలి వర్సిటీ అయిన జేఎన్టీయూహెచ్ల ర్యాంకులు దిగజారాయి. ఇతర వర్సిటీలదీ అదే పరిస్థితి. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, కోర్సుల నాణ్యత, ప్లేస్మెంట్స్, ఆర్థిక వనరులు, పరిశోధన వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. కేవలం తెలంగాణకు చెందిన మూడు సంస్థలు మాత్రమే దేశంలో పలు విభాగాల్లో టాప్-10 జాబితాలో నిలిచాయి. ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీ హైదరాబాద్ 3వ ర్యాంకు. ఫార్మసీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైపర్) 2వ ర్యాంకు, న్యాయ విద్యాసంస్థల్లో నల్సార్ లా యూనివర్సిటీ 3వ ర్యాంకు సాధించాయి.
ఓవరాల్ క్యాటగిరిలో ఉస్మానియా వర్సిటీకి 2023లో 64వ ర్యాంకు వస్తే, ఈసారి ఇది 70కి పడిపోయింది. విశ్వవిద్యాలయాల వారీగా నిరుడు 36 ర్యాంకు ఉంటే, ఈసారి 43కు పడిపోయింది. జేఎన్టీయూ హైదరాబాద్కు గత ఏడాది 83 ఉంటే, ఈసారి 88కు పడిపోయింది. ఐఐఐటీ హైదరాబాద్ ర్యాంకు మెరుగయ్యింది. గతంలో 84 ర్యాంకు రాగా, ఈసారి 74వ ర్యాంకు దకింది. కళాశాలల స్థాయిలో వందలోపు ఏ ఒక కళాశాలకూ చోటు దక్కలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఈసారి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు, సిల్ యూనివర్శిటీలు, ఓపెన్ యూనివర్శిటీలకు కూడా ర్యాంకులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల విభాగంలో 50 యూనివర్శిటీలు పోటీపడగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 6వ స్థానం లభించింది.