సిరిసిల్ల టౌన్, జనవరి 12: హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మ హిళల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం సిరిసిల్లలోని పలు వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, 32వ వార్డులో పలు వురు మహిళలు వినూత్న నిరసన తెలిపారు. ‘రూ.4వేలు పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవం త్‌రెడ్డి’ అంటూ ఓ మహిళ ముగ్గు ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ‘తులం బంగారం కట్’ అంటూ మరో మహిళ ముగ్గు వేసింది.
పర్వతగిరి, జనవరి 12 : రూ.2 లక్షల పంట రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని కోరుతూ ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని నినదించారు. ఏనుగల్లులోని గ్రామీణ వికాస్ బ్యాంకులో 1100 మందికి రుణాలుండగా, 700 మంది రైతులకే మాఫీ జరిగిందని చెప్పారు. పీఏసీఎస్‌లో 1400 రైతులకుగాను కేవలం 800 మందికే రుణాలు మాఫీ అయ్యాయని వివరించారు. రైతుభరోసాలో ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.