Rythu Bharosa | వరంగల్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు భరోసా పథకం అమలు కోసం రైతుల అభిప్రాయం తీసుకుంటామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఏమాత్రం పొంతన కుదరడం లేదు. పంట పెట్టుబడి సాయంగా రైతులకు ప్రభుత్వం ఇవ్వనున్న రైతు భరోసాపై విధి విధానాల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల రైతులతో సమావేశం నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు.
రైతుల నుంచి అభిప్రాయ సేకరణ అని చెప్పినప్పటికీ, అధికారులు ముందుగా రూపొందించిన జాబితాలో పేర్కొన్న వారికి మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇద్దరికి చొప్పున ఈ జాబితాలో చోటు కల్పించారు. స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన పేర్లను అధికారులు జాబితాలో రాశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద రైతుల పేరు, ఊరు, మండలం, జిల్లా వివరాలు ప్రకటించగానే ఆ వ్యక్తి అభిప్రాయం చెప్పారు. అధికారులు తయారుచేసిన జాబితాలో అందరూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆ పార్టీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు. అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వారు ఏం మాట్లాడాలో ఆదివారమే వీరికి స్పష్టంగా చెప్పారు. పేరు పిలిచిన వారే మాట్లాడాలని, మిగిలినవారు ఎవరూ లేచి మాట్లాడవద్దని కలెక్టర్ పలుమార్లు ఆదేశించారు.
దీంతో విసిగిపోయిన రైతులు ఆ మాత్రానికి తమనెందుకు పిలిచారని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల జోక్యం చేసుకుని జాబితాలో లేని మరో నలుగురితో మాట్లాడించారు. రైతుల అభిప్రాయాలు అని చెప్పి సమావేశానికి వచ్చిన కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ప్రస్తుత పాలకమండలి సభ్యుడితోనూ మాట్లాడించారు. రైతు భరోసా విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు,్ల కార్పొరేటరు,్ల కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాత్రమే అనుమతించారని అఖిల భారత రైతు సమఖ్య హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డిహంసరెడ్డి, అఖిలభారత వ్యవసాయ కార్మిక సమఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనె కుమార్‌స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాభిప్రాయమే సర్కారు జీవో
ప్రజాభిప్రాయం ప్రకారమే రైతు భరోసా పథకం అమలు మార్గదర్శకాలను రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు అభిప్రాయ సేకరణలో వచ్చిన అంశాలతోనే రైతు భరోసాపై ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. రైతు భరోసా మార్గదర్శకాలపై ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ జరుపుతున్నామని, ఈ అభిప్రాయాలపై శాసనసభలో చర్చించి తీర్మానం చేయనున్నట్టు చెప్పారు.