హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): భారత సైన్యం ప్రదర్శించిన పాటవానికి ఒక భారతీయుడిగా గర్వపడుతున్నానని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం అంతం కావాల్సిందే. ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి. భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశరక్షణలో ఎవరికీ తీసిపోమన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.