హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, అమాయక ఆదివాసీలపై క్రూరంగా దాడులు జరిపి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వెంటనే ఆపరేషన్ కగార్‌ను ఆపేయాలని ఏఐవైఎఫ్(అఖిల భారత యువజన సమాఖ్య) రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐవైఎఫ్ కార్యాలయం లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇటీవల జరిగిన మావోయిస్టుల హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్రం కాల్పు ల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ‘చలో రాజ్‌భవన్’ నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఆఫీస్ బేరర్లు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, శ్రీనివాసులు, సత్యప్రసాద్, మహేందర్, శ్రీమాన్, కొండల్, రాష్ట్ర సమితి సభ్యులు మహేశ్, ఉపేంద్ర, సల్మాన్‌బేగ్, శివకుమార్, రాజేశ్, మహమూద్, మాజిద్, మహేశ్, మధు పాల్గొన్నారు.