ఆదివారం 31 మే 2020
Telangana - May 06, 2020 , 02:17:07

తెరుచుకున్న కాళేశ్వరం ప్రైస్‌బిడ్లు

తెరుచుకున్న కాళేశ్వరం ప్రైస్‌బిడ్లు

  • అదనపు టీఎంసీల తరలింపునకు  టెండర్లు
  • ఎనిమిది ప్యాకేజీలుగా పనుల విభజన  
  • 1.90 నుంచి 2.80 శాతం ఎక్కువకు  టెండర్లు దక్కించుకున్న 5 కంపెనీలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా అదనపు టీఎంసీల తరలింపు పనులకు సంబంధించిన ప్రైస్‌బిడ్లను నీటిపారుదలశాఖ అధికారులు మంగళవారం తెరిచారు. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం వరకు మూడో టీఎంసీ,  ఎస్సారార్‌ నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయం వరకు రెండో టీఎంసీ జలాలను తరలించేందుకు చేపట్టాల్సిన పనులపై గతంలో టెండర్లు పిలిచారు. ఎనిమిది ప్యాకేజీలుగా పిలిచిన ఈ టెండర్లకు సంబంధించి మంగళవారం ప్రైస్‌బిడ్లు తెరువగా ఐదు కంపెనీలు ఈ పనులను దక్కించుకున్నాయి. ఎనిమిది ప్యాకేజీల్లో కనిష్ఠంగా 1.90 శాతం, గరిష్ఠంగా 2.80 శాతం ఎక్కువకు కోట్‌చేసిన కంపెనీలు ఆయా పనులను దక్కించుకున్నట్టు నీటిపారుదలశాఖవర్గాలు తెలిపాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుంచి వరద కాల్వవరకు రోజుకు రెండుటీఎంసీల జలాలను తరలించేందుకు వ్యవస్థ ఇప్పటికే ఉన్నది. ఎల్లంపల్లి నుంచి రెండుదశల్లో ఎత్తిపోసిన నీళ్లు వరద కాల్వద్వారా ఎస్సారార్‌ జలాశయానికి చేరుకుంటున్నాయి. ఎల్లంపల్లి నుంచి ఎస్సారార్‌కు మూడో టీఎంసీ తరలింపునకు ప్రత్యేకంగా పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించారు. రూ.11,806 కోట్లతో నాలుగు ప్యాకేజీలుగా అధికారులు టెండర్లు పిలవగా.. జీఎస్టీ, ఇతర పన్నులు పోగా విలువ రూ.9,747.30 కోట్లుగా ఉన్నది. దీంతోపాటు ఎస్సారార్‌ నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ వరకు ఇప్పటికే ఒక టీఎంసీ జలాల తరలింపు కొనసాగుతున్నది. అదనంగా మరో టీఎంసీ తరలింపునకు అధికారులు టెండర్లు పిలిచారు. రూ.11,712.70 కోట్ల విలువైన పనులను కూడా మరో నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించారు. మొత్తం ఎనిమిది ప్యాకేజీలకు సంబంధించి మంగళవారం అధికారులు ప్రైస్‌బిడ్లను తెరిచారు. దాఖలైన బిడ్లలో తక్కువ కోట్‌చేసిన ఏజెన్సీని ఎల్‌-1గా ఎంపికచేశారు. 

రంగనాయక సాగర్‌లో జలకళ 

  • నీటిపారుదలశాఖ శాటిలైట్‌ చిత్రం విడుదల 

 కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా అన్నపూర్ణ జలాశయం నుంచి రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌కు గోదావరిజలాల తరలింపు కొనసాగుతున్నది. జలాశయంలోకి ఎత్తిపోత మొదలుకాకముందు.. ప్రారంభమైన తర్వాత మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న రంగనాయకసాగర్‌ జలాశయానికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలను నీటిపారుదలశాఖ మంగళవారం విడుదలచేసింది. ఈ నెల 3వ తేదీన తీసిన చిత్రం లో 1.35 టీఎంసీల నిల్వతో జలాశయం కళకళలాడుతున్న దృశ్యం కనిపించింది.logo