TIMS Sanathnagar | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడతలో (2014-18) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, రెండో విడతలో (2018-23 మధ్య) వైద్యారోగ్య రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని పలుమార్లు కేసీఆర్ ప్రకటించారు. అది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపించారు.
హైదరాబాద్ మహానగరంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అంటే గుర్తుకొచ్చేవి గాంధీ, ఉస్మానియా, నిమ్స్. వీటిల్లో గాంధీ, ఉస్మానియా దవాఖానలు నిజాం కాలంలోనే ఏర్పాటయ్యాయి. వీటికి వందేండ్లకుపైగా చరిత్ర ఉన్నది. చివరగా నిమ్స్ దవాఖాన హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంలో 1951లో ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి ఇవి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు ఆరుదశాబ్దాలపాటు ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. కనీసం ఒక్క సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్యసేవలు అందించలేక ఆయా దవాఖానలపై ఒత్తిడి పెరిగిపోయింది.
మరోవైపు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు నిరుపేదలకు అందని ద్రాక్షగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నగరం నలువైపులా ‘టిమ్స్’ పేరుతో సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
యుద్ధప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంటే ఏడాది కాలంలోనే అన్ని దవాఖానల నిర్మాణ పనులు 60 శాతానికిపైగా పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను నిలిపివేసింది. అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కాలం గడిపింది. అయితే బీఆర్ఎస్తోపాటు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో తిరిగి పనులను పట్టాలెక్కించింది. గత సంవత్సరమే మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి రావాల్సి ఉండగా, ప్రస్తుతం సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి.
3వేల సూపర్ స్పెషాలిటీ పడకలు
‘టిమ్స్ దవాఖాన ఆషామాషీగా ఉండదు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సకల వసతులు ఉంటాయి’ అని శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి తగ్గట్టే ఎయిమ్స్ తరహాలో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో రూ.2,679కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. వెయ్యి పడకల చొప్పున మొత్తంగా 3వేల సూపర్ స్పెషాలిటీ పడకలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రతి పడకకూ ఆక్సిజన్ సౌకర్యం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మూడింటిలో కలిపి 900 పడకలు ఐసీయూకు కేటాయించడం విశేషం. ఒక్కో టిమ్స్ లో 30 విభాగాలు అందుబాటులోకి వస్తాయి.గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు, ఊపిరితిత్తులు, క్యాన్సర్, ఎండోక్రైనాలజీ, అలర్జీ, రుమాటాలజీ, ట్రామా కేర్ సేవలు, ల్యాబొరేటరీ తదితర సేవలను ఒకేచోట అం దించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకున్నది.
పేద దంపతులకు సంతానభాగ్యం
కేసీఆర్ ప్రభుత్వ సంకల్పం నుంచి వచ్చిన మరో ఫలం ఐవీఎఫ్ కేంద్రం. సంతానం లేక అవస్థలు పడుతున్న పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వం మానవతా కోణంలో ఆలోచించింది. వారి మానసిక వ్యథను తీర్చడంతోపాటు సామాజికంగా వారికి గౌరవం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానల్లో ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గాంధీ, పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం దవాఖానల్లో అత్యాధునిక ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు విడుదల చేసింది. ఇందులో మొదటగా 2023 అక్టోబర్‌లో గాంధీ దవాఖానలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించింది.
ప్రజల ఆరోగ్యానికి అండగా..
‘ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, భవిష్యత్తు తరాలు బాగుంటాయి. తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది’ అనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగానే నగరాలు, పట్టణాల్లోని పేదలకు వైద్యసేవలు చేరువ చేసేందుకు బస్తీ దవాఖానలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవి రోజూ వేలాది మందికి ఉచితంగా సేవలు అందిస్తూ వారికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. మరోవైపు పెద్దాసుపత్రులపై ఓపీ భారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. టెలిమెడిసిన్ సేవలతో బస్తీ దవాఖానల నుంచే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర దవాఖానల వైద్యులను సంప్రదించి సూపర్ స్పెషాలిటీ సేవలు పొందేందుకు అవకాశం కల్పించింది. అవయవాల మార్పిడిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి ఎంతో మంది రోగులకు పునర్జీవం ప్రసాదించింది కేసీఆర్ ప్రభుత్వం. పేద విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పించడంతోపాటు ప్రజలకు స్పెషాలిటీ సేవలను చేరువ చేసేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 33 జిల్లాల్లో వైద్య కళాశాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా తెలంగాణలో తెల్లకోటు విప్లవం మొదలైంది.
ప్రజలకు వైద్యసేవలను మెరుగుపరిచే సంకల్పంతో నాడు తీసుకున్న నిర్ణయాల ఫలాలు తెలంగాణలో ఇప్పటికీ ప్రజలకు అందుతూనే ఉన్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ సనత్‌నగర్‌లోని టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) దవాఖాన. కేసీఆర్ 2022లో శంకుస్థాపన చేసి, నిర్మాణం ప్రారంభించిన ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభం అయ్యాయి. సంతానం లేని నిరుపేద దంపతులకు ఉచితంగా సంతాన భాగ్యం కల్పిస్తున్న గాంధీ దవాఖానలోని ‘ఐవీఎఫ్’ కేంద్రం కేసీఆర్ సంకల్పంలోని భాగమే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలు, జిల్లాకో మెడికల్ కాలేజీ వంటివి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
-సనత్‌నగర్‌లోని టిమ్స్ ట్రయల్న్‌త్రో నిజమైన కేసీఆర్ కల
రాష్ట్ర ప్రజలంతా చక్కని ఆరోగ్యం, సుఖ సంతోషాలతో జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నది. రాష్ట్రంలోని నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టాం. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు మెరుగుపరిచాం. అధునాతన వైద్యపరికరాలను అందుబాటులోకి తెచ్చాం. నగరవాసులతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఉచితంగా సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు టిమ్స్ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
-2022 జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
సనత్‌నగర్ టిమ్స్ ప్రత్యేకతలు ఇవే