ఊటూర్, ఆగస్టు 3 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆదివారం నారాయణపేట జిల్లా ఊటూర్ మండల కేంద్రంలో మక్తల్- నారాయణపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతుల నిరసనకు అఖిలపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ అరవింద్ కుమార్‌తోపాటు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ మక్తల్ ప్రాంత రైతుల పొట్టకొట్టి సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎట్లాగైనా సరే..
సాగునీటిని తరలించాలనే కుట్రలో భాగంగానే నిర్వాసితుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓ పక భూ నిర్వాసితులు నిరసనలు చేస్తుంటే మంత్రి వాకిటి శ్రీహరి చెకులను పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూ నిర్వాసితుల జిల్లా కమిటీ సభ్యులు ధర్మరాజుగౌడ్, గోపాల్‌రెడ్డి, మశ్చేందర్ మాట్లాడుతూ.. కోట్ల విలువ చేసే భూములను ప్రభుత్వం ఎకరాకు రూ. 14లక్షల పరిహారం అందించి చేతులు దులుపుకుంటోందని, సరైన పరిహారం అందించేందుకు కమిషన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.