హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం టెండర్లు నత్తనడకన సాగుతున్నాయి. 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ వెలువడి 17 రోజులవుతున్నా, ఇప్పటివరకు 6,893 దరఖాస్తులే దాఖలైనట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించంది. రాష్ట్ర సగటు లెకల ప్రకారం.. ఒకో మద్యం దుకాణానికి 2.63 దరఖాస్తులే దాఖలయ్యాయి. గత ప్రభుత్వంలో ఇవే మద్యం దుకాణాలకు 1.32 లక్షల దరఖాస్తులొచ్చాయి. నాడు రాష్ట్రంలో ప్రతి దుకాణానికి సగటున 51 దరఖాస్తులొచ్చాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,585 దరఖాస్తులు దాఖలవగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 174 వచ్చాయి. రాబోయే నాలుగు రోజుల్లో భారీ ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ, ఈసారి కనీసం ఒక లక్ష దరఖాస్తులు కూడా దాటే పరిస్థితి కనిపించడం క్షేత్రస్థాయి అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్.. ఇలా ప్రతి జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నదని చెప్తున్నారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ నేతల మద్దతుతో భారీఎత్తున సిండికేట్లు ఏర్పడి టెండర్లు వేయకపోవడం, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వైఫల్యం, రియల్ఎస్టేట్ బూమ్ పడిపోవటంతో కొత్త వాళ్లు మద్యం వ్యాపారంలోకి రాకపోవడం, దరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెరగడం, త్వరలోనే ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచబోతున్నదనే సంకేతాలు వెలువడుతుండటం కారణమని ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
నత్తనడకన దరఖాస్తుదారులు
పాత మద్యం లైసెన్స్‌కు ఈ నెల 30తో గడువు తీరిపోతున్నది. 2025-2027 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 20న నోటిఫికేషన్, సెప్టెంబర్ 26న షెడ్యూల్ విడుదల చేసింది. మద్యం దుకాణాలకు దరఖాస్తులు సమర్పించడానికి అక్టోబర్ 18 వరకే గడువు ఉన్నది. ఈ నెల 23న డ్రా తీస్తారు. ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో టెండర్ల సంఖ్య పెంచేందుకు ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులకు ఫోన్లు చేసి టెండర్లు వేయాలని సూచిస్తున్నారు. సోమవారం సప్తమి మంచిరోజు అని వ్యాపారులకు ఫోన్లు చేసి ప్రోత్సహించినా రాష్ట్రవ్యాప్తంగా 1,280 దరఖాస్తులకు మించి రాలేదని తెలిసింది. దీంతో 16న దశమి, 17న ఏకాదశి, 18న ద్వాదశి మంచి ముహూర్తాలు, తిథులు ఉన్నాయని చెప్తూ అధికారులు ఫోన్లు చేస్తున్నారట. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2023లో 8,128 అప్లికేషన్లు రాగా.. ఈసారి 3,056 దరఖాస్తులే వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రితంసారి 10,734 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 435 దరఖాస్తులే వచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్ నేతల చేతుల్లో సిండికేట్లు
కాంగ్రెస్ నేతల చేతుల్లోకి వెళ్లిపోయిన మద్యం పాత వ్యాపారులు సిండికేట్లుగా మారినట్టు తెలుస్తున్నది. స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏ జిల్లాకు ఆ జిల్లాలో జట్టుకట్టిన సిండికేట్లే మద్యం దరఖాస్తులను శాసిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దరఖాస్తు చేసుకొనేందుకు పటాన్చెరులో ఒక మద్యం వ్యాపారి డీడీ తీయగా, సదరు వ్యాపారిని సిండికేట్ బెదిరించింది. దీంతో ఆ డీడీని ఏం చేయాలో తెలియని స్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో రూ.కోట్లకు కోట్లు ధారపోసి, వందలకు వందల టెండర్లు వేసి డబ్బు పోగొట్టుకునే బదులు, పదుల సంఖ్యలో టెండర్లు వేయాలని ఔత్సాహికులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే మద్దతుతో లైసెన్సీకి ఎంతోకొంత ముట్టచెప్పి దుకాణం తీసుకోవడమే ఉత్తమం అనే నిర్ణయానికి కొందరు మద్యం వ్యాపారులు వచ్చినట్టు సమాచారం.
తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అంతర్గత ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ, మద్యం టెండర్ల మీద రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి, సొంత నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధనలు మద్యం సిండికేట్లను ప్రోత్సహించేవిధంగా ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రతి పాలసీలో 15 నుంచి 20% వరకు యువత కొత్తగా మద్యం వ్యాపారంలోకి వస్తున్నదని ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ క్షేత్రస్థాయిలో ఇటువంటి సిండికేట్లను ఎప్పటికప్పుడు గుర్తించి ధ్వంసం చేయాల్సి ఉన్నది. కానీ, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారికి, క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య అసలు కమ్యూనికేషనే లేనట్టు తెలిసింది. క్షేత్రస్థాయి ఎన్ఫోర్స్మెంట్ లేక సిండికేట్లు బలపడినట్టు, వారి ప్రభావంతోనే మద్యం దరఖాస్తులు వెనుకబడినట్టు తెలుస్తున్నది.
వ్యాపారంపై ‘హైడ్రా’ తీవ్ర ప్రభావం
హైడ్రా కూల్చివేతలు ఎక్సైజ్ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి తోడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వీర్యం కావడంతోనే మద్యం వ్యాపారం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం కూడా మరో కారణమని చెప్తున్నారు. హైడ్రా కూల్చివేతలతో గత రెండేండ్లుగా రాష్ట్రంలో రియల్ఎస్టేట్ వ్యాపారం కోలుకోనివిధంగా దెబ్బతిన్నది. దీంతో టెండర్లు వేయడానికి చాలామంది ఆసక్తి చూపడంలేదని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారం బాగున్న రోజుల్లో.. అక్కడ సంపాదించిన డబ్బును యువత మద్యం వ్యాపారంలో పెట్టుబడి పెట్టేది. 5 నుంచి 10 మంది యువత ఒక గ్రూపుగా ఏర్పడి 20 నుంచి 30 దుకాణాలకు దరఖాస్తు చేసేవారు. అప్పట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా గ్రూపులుగా ఏర్పడి మద్యం టెండర్లు వేసేవారని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మద్యం ధరలు పెంచడం, మద్యం ఉత్పత్తి కంపెనీలకు దాదాపు రూ.3,500 కోట్ల బకాయి పడటంతో ఆయా కంపెనీలు డిమాండ్‌కు తగిన మద్యం ఉత్పత్తి చేయలేకపోతున్నాయని, ఇది వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.