హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్‌రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) అనుమతులు రాలేదు. ఇప్పుడు నీటివాటాలోనూ గండిపడుతున్నది. ఈ ప్రాజెక్టును 45 టీఎంసీలకే పరిమితం చేయాలని కేంద్రం సూచించడంతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది. దీంతో పాలమూరుకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలంగాణ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాలనే సంకల్పంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి(పీఆర్ఎల్ఐఎస్) 2015లో తెలంగాణ ప్రభుత్వం రూ.35వేల కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టింది. తొలి దశలో తాగునీటి పనులను, రెండో దశలో సాగునీటి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ది. నాటి నుంచి పొరుగు రాష్ట్రం ఏపీతోపాటు స్వరాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఏపీ దుశ్చర్యలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అడుగడుగునా వత్తాసు పలుకుతున్నది.
అందులో భాగంగా నికర జ లాలు ఉన్న ప్రాజెక్టులకే అనుమతులు ఇచ్చేలా కేంద్ర జలసంఘం కొత్త మార్గదర్శకాలు రూపొందించి గెజిట్ విడుదల చేసింది. అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అంటూ షరతులు విధించింది. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీఆర్ఎల్ఐఎస్కు అనుమతులు సాధించాలనే లక్ష్యంతో నికర జలాలు కేటాయించింది. పోలవరం డైవర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే 45 టీఎంసీలతోపాటు మైనర్ ఇరిగేషన్ కింద ట్రిబ్యునల్ కేటాయించిన 89 టీఎంసీల్లో వినియోగించకుండా ఉన్న 45 టీంఎసీలను కలిపి మొత్తం 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తూ జీవో 246ను విడుదల చేసింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను 2022లో సీడబ్ల్యూసీకి సమర్పించి, పలు అనుమతులను సైతం సాధించింది.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో డీపీఆర్ వెనక్కి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు డీ పీఆర్‌ను సీడబ్ల్యూసీ తిప్పి పంపింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్వయం గా కేంద్ర జల సంఘమే స్పష్టంచేసింది. మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేసే 45.66 టీఎంసీల ను వాడుకుంటామని ప్రభుత్వం చెప్పిందని, సంబంధించిన వివరాలు సమర్పించాలని అ డిగినా, లేఖలు రాసినా రేవంత్ సర్కారు స్పం దించడం లేదని సీడబ్ల్యూసీ ఆక్షేపించింది. గో దావరి నుంచి మళ్లించే 45 టీఎంసీల అంశం కూడా ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నదని వెల్లడించింది. దానిపై స్పష్టతనివ్వాలని కోరినా, పలుమార్లు లేఖలు రాసిన సర్కారు స్పందించలేద ని పేర్కొన్నది. ఆ క్రమంలో డీపీఆర్‌ను పరిశీలన జాబితా నుంచి తొలగించి, ప్రభుత్వానికి తిప్పిపంపుతున్నట్టు స్పష్టం చేసింది.
ఇప్పుడు 45 టీఎంసీలకు కుదింపు
తాజాగా డీపీఆర్‌ను 90 టీఎంసీలతో కా కుండా 45 టీఎంసీలతోనే ప్రతిపాదించాలని కేంద్రం సూచించినట్టు తెలుస్తున్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తున్నట్టు స మాచారం. వాస్తవానికి 1974లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించినట్టయితే నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్‌లోని నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీ లు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున పంచింది.
ఉమ్మడి ఏపీకి నాగార్జునసాగర్ ఎగువన మాత్రమే 45 టీఎంసీల ను పంచామని, ఆ నీటిని కూడా బేసిన్‌లోని ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. దాని ప్రకారం ఆ 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణకే దక్కుతాయని రాష్ట్ర ప్ర భుత్వం మొదటినుంచీ వాదిస్తున్నది. సీడబ్ల్యూసీని ఒప్పించలేక సర్కారు చతికిలపడిం ది. ప్రస్తుతం పోలవరం డైవర్షన్ ద్వారా ఉ మ్మ డి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను సైతం పునః పంపిణీ చేయాలని ట్రిబ్యునల్‌కు కేం ద్రం సూచించింది. దీనిపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు మినహాయించి మైనర్ ఇరిగేషన్ మిగులు 45 టీఎంసీలతోనే డీపీఆర్ ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది.
రేవంత్ సర్కారు వైఫల్యమే
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి రావడం, ఈఏసీ అనుమతులు ఇప్పటి కీ లభించకపోవడం పూర్తిగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యమే. వాస్తవానికి నాగార్జునసాగర్ ఎగువన ఏపీకి ఎలాంటి ఇన్ బేసిన్ ప్రాజెక్టులే లేవు. ఆ 45 టీఎంసీలను తమకు కేటాయించాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు ఏపీ ఎ లాంటి విజ్ఞప్తి చేయలేదు. తెలంగాణ మాత్రం ఆ 45 టీఎంసీలు తమకే చెందుతాయని స్ప ష్టం చేసింది. ఆ నీటిని ఇన్ బేసిన్ ప్రాజెక్టులకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది. న్యాయవివాదాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులకు గతంలో కేంద్ర జలసంఘ మే అనుమతులిచ్చింది.
ఈ అంశాలన్నీ వివరించి సీడబ్ల్యూసీని ఒప్పించడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కేంద్రం సూచించినట్టు ప్రాజెక్టును 45 టీఎంసీలకే పరిమితం చేస్తే తీరని నష్టం వాటిల్లుతుందని నిప్పులు చెరుగుతున్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు అవిశ్రాంత కృషి ఫలితంగా ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు 49వ సమావేశంలో ఈఏసీ అంగీకరించింది. ఆమేరకు కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ, రెండేండ్లు గడిచినా కేంద్రం అనుమతులు మంజూరు చే యలేదు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అనుమతులు సాధించి, పనులు చేపట్టే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.