Srisailam Reservoir | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు అనుమానించినంత పనైంది. ఈ ప్రాంత ఇంజినీర్ల హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కండ్ల ముందే కనిపిస్తున్నది. మొత్తంగా హైదరాబాద్‌తోపాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ జిల్లాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయి ఈ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో వినియోగానికి అందుబాటులో 18 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కేవలం 25 రోజుల్లోనే దాదాపు 55 టీఎంసీల నీరు తగ్గింది. మరోవైపు వేసవి తాగునీటి అవసరాలు మరో 3 నెలలకు పైగా తీరాల్సి ఉన్నది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నది. దీంతో రానున్న మూడు నెలలపాటు తాగునీటికి తండ్లాట తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ముంచుకొస్తున్నా.. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చోద్యం చూస్తున్నా యి. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. గత డిసెంబర్ నాటికి 210.81 టీఎంసీలు ఉన్నాయి.
మార్చి 1 నాటికి రిజర్వాయర్‌లో దాదాపు 100 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కానీ ప్రస్తుత నీటిమట్టం 46 టీఎంసీలు మాత్రమే. కేవలం 25 రోజుల్లోనే 54 టీఎంసీలు ఖాళీ అయ్యియి. అందులో తెలంగాణ అత్యల్పంగా వాడుకోగా, ఏపీ సర్కార్ అత్యధిక నీటిని తరలించుకుపోయింది. ఇప్పటికీ ఏపీ సర్కార్ ఈ రిజర్వాయర్ నుంచి జలాలను యథేచ్ఛగా మళ్లించుకుపోతూనే ఉన్నది. మరోవైపు రిజర్వాయర్ ఎండీడీఎల్ (మినిమం డ్రాడౌన్ లెవల్) 834 అడుగులు కాగా, ప్రస్తుతం 826 అడుగులకు చేరుకొన్నది. రిజర్వాయర్ నుంచి 800 అడుగుల వరకూ నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నది. 800 ఫీట్ల లెవల్లో రిజర్వాయర్‌లో 29 టీఎంసీలు డెడ్‌స్టోరేజీలో ఉంటాయి. నికరంగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో వినియోగానికి అందుబాటులో ఉన్నది కేవలం 17 టీఎంసీలు మాత్రమే.
శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో కల్వకుర్తి ఆయకట్టు 2.80 లక్షల ఆయకట్టు ప్రస్తుత సీజన్లోనే సాగవుతున్నది. ఏప్రిల్ రెండోవారం వరకు కాలువలకు నీటిని విడుదల చేయా ల్సి ఉన్నది. అందుకు దాదాపుగా ట్రాన్స్మిషన్ నష్టాలను కలుపుకొని మరో రెండు తడులకు 8టీఎంసీల మేర సాగునీరు అవసరమని అంచ నా. అవిగాక ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు, మరో రెండు జిల్లాల తాగునీటి అవసరాలను ఇదే రిజర్వాయర్ నుంచే తీర్చాల్సి ఉన్నది. ప్రస్తుతం డెడ్‌స్టోరేజీ వరకు అందుబాటులో ఉన్నదే 17టీఎంసీలు. మరోవైపు ఈ రోజూ కూడా ఏపీ జలాలను తరలిస్తూనే ఉన్నది. ఏప్రిల్ మొదటివారం వచ్చేనాటికే రిజర్వాయర్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొన్నది. దీంతో తాగునీటికి తండ్లాట తప్పని పరిస్థితి ఏర్పడనున్నది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. డిసెంబర్ నాటికి 306.70 టీఎంసీలతో నిండుగా ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టు లెవల్ 535 ఫీట్లు ఉం డగా 178 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ప్రా జెక్టు డెడ్ స్టోరేజీ 510 అడుగులు అంటే అక్కడ 131 టీఎంసీలు అందుబాటులో ఉండనున్నా యి. ఆ లెక్కన ప్రస్తుతం సాగర్‌లో నికరంగా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉన్నవి 47 టీఎంసీలు మాత్రమే. దీంతో సాగర్‌లోనూ అంతంతమాత్రంగా నీటి నిల్వలు ఉన్నాయి. సాగర్ ప్రాజెక్టు నుంచి ఏఎమ్మార్పీ కింద 2.38 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ కింద 6.38 లక్ష ల ఎకరాలు మొత్తంగా 8.76 లక్షల ఆయకట్టు యాసంగిలో సాగవుతున్నది. తైబందీ ప్రకారం ఏప్రిల్ రెండో వారం కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నది. మరో రెండు తడుల వరకు నీటిని అందించాలి. అందుకోసం దాదాపు ట్రా న్స్మిషన్ నష్టాలు కలుపుకొని 25 టీఎంసీలకు పైగా నీటి అవసరం ఉన్నది. వీటితోపాటు హైదరాబాద్, నాగార్జునసాగర్, హుజూర్నగర్, మి ర్యాలగూడ, కోదాడ, నల్లగొండ, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నది. జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యే నాటికి ఆయా ప్రాంతాల తాగునీటి అవసరాలనూ తీర్చాల్సి ఉన్నది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి రికార్డు స్థాయిలో ఏపీ ఈ ఏడాది కృష్ణాజలాలను దోచుకుపోయింది. ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే దాదాపు 240 టీఎంసీలను మళ్లించింది. ఏపీని నిలువరించాలని లేఖలు రాయడం తప్ప కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉదాసీనత మూలంగా కేఆర్ఎంబీ సైతం పట్టించుకొన్న పాపాన పోలేదు. ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న నీటి నిల్వలు మొత్తం కావాలని ఏపీ డిమాండ్ చేయడం అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. రెండు రిజర్వాయర్లలో కలిపి మార్చి 10 నాటికి అందుబాటులో ఉన్నవే 78 టీఎంసీలు. కానీ అందులో 73 టీఎంసీలు తనకే కా వాలని ఏపీ డిమాండ్ చేస్తూ కేఆర్ఎంబీకి ప్రతిపాదనలు పంపింది. ఇంతకాలం చోద్యం చూస్తూ వచ్చిన బోర్డు సైతం ఇప్పుడు ఏపీ ప్రతిపాదనలు పెట్టగానే హడావుడిగా స్పందించింది. ఏపీ ప్రతిపాదనలపై అభిప్రాయం చెప్పాలని తె లంగాణను కోరుతూ హుటాహుటినా లేఖ రా యడం.. ఏపీకి బోర్డు ఏ స్థాయిలో వంతపాడుతున్నదో తేటతెల్లమవుతున్నది. నీటి విడుదలకు బోర్డు ఆదేశాలు ఇవ్వకుండానే ఏపీ యథేచ్ఛగా జలాలను వినియోగించుకొంటున్నది.