హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యాసంవత్సరం కొత్తగా 41 స్కూళ్లను ప్రారంభించగా వీటిల్లో 1,565 మంది మాత్రమే చేరారు. వెయ్యి మంది వరకు సంగారెడ్డి జిల్లాలోనే ప్రవేశాలు పొందారు. ఈ జిల్లాలో ఆరు స్కూళ్లల్లో వెయ్యి మంది వరకు చేరగా, 35 స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య ఐదు వందలు మాత్రమే. కొల్లూరు డబుల్ బెడ్రూం కాలనీలో కొత్తగా ప్రారంభించిన సర్కారు బడిలో గణనీయంగా అడ్మిషన్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 557 సర్కారు బడులను ప్రారంభించేందుకు విద్యాశాఖ అనుమతులిచ్చింది.
212 గ్రామీణ హ్యాబిటేషన్లు, 359 అర్బన్ కాలనీల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. 20 మంది విద్యార్థులుండి ఆయా ప్రాంతంలో సర్కారు బడి లేకపోతే కొత్తగా సర్కారు బడిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో 63, పట్టణప్రాంతాల్లో 94 చొప్పున కొత్త ప్రాథమిక బడులను ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు. వీటిలో 41 స్కూళ్లను మాత్రమే ప్రారంభించడం గమనార్హం. వాస్తవానికి జూన్ 12 నుంచి కొత్తవిద్యాసంవత్సరం ప్రారంభమయ్యింది. విద్యాశాఖ మాత్రం జూలై 2న కొత్త స్కూళ్లకు అనుమతులిచ్చింది. ఆలస్యంగా కొత్త బడులను తెరవడంతో విద్యార్థుల చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.