వనపర్తి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : టైలరింగ్.. చూడటానికి చాలా సాధారణ వృత్తి.. ప్రతి ఇంట్లోనూ ఈ పని అందరికీ తెలిసే ఉంటుంది.. బయట పనులు చేయకపోయినా చాలా మంది మహిళలు సొంత పని చేసుకుంటే సరి అనుకుంటూ ఈ రంగం వైపు మొగ్గు చూపుతుంటారు. అలా వేసిన ముందడుగు వారిని ఎంతో దూరం తీసుకెళ్లింది. నిత్యం రంగు.. రంగుల దారాలు, నూతన డిజైన్లతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఆ‘దారం’తోనే అనురాధ అనే మహిళ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నది. 30 ఏండ్లుగా తనకు అనుభవం ఉన్న టైలరింగ్ రంగంలో వెయ్యి మందికిపైగా శిక్షణనిచ్చింది.. నేడు టైలరింగ్ దినోత్సవం సందర్భంగా ఆమె సక్సెస్ స్టోరీ.
చదువుకున్న ప్రతిఒక్కరూ ఉద్యోగం కోసమే అధికంగా వెంపర్లాడతారు. ప్రభుత్వ కొలువైతే పక్కాగా నెల జీతం వస్తుందని నమ్మకం. 30ఏండ్ల కిందట డిగ్రీ పూర్తి చేసుకొని ఎలాంటి ఉద్యోగ వేట కొనసాగించకుండా స్వతహాగానే ఎదగాలనే లక్ష్యంతో వనపర్తిలో అనురాధ అనే మహిళ ముందడుగు వేసింది. వనపర్తి పట్టణంలో 35ఏండ్లుగా తాను నమ్ముకున్న టైలరింగ్ వృత్తిని అంచెలంచెలుగా మార్పులు చేస్తూ మహిళాలోకానికి అనువైన పద్ధతుల్లో తన నైపుణ్యాన్ని జోడించి అందనంత ఎత్తుకు ఎదిగింది.
అత్యంత సాధారణంగా ప్రారంభించిన అనురాధ టైలరింగ్ వృత్తి అనూహ్యమైన మలుపు తిరిగింది. పదుల సంఖ్యలో టైలరింగ్ నేర్చుకునేందుకు మహిళలు రావడంతో కొత్త పుంతలు తొక్కింది. గురుదక్షిణ రూపంలో ఇచ్చిన డబ్బులతో వచ్చిన వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రయోజకులుగా తీర్చిదిద్దడంతో ఎన్నో కుటుంబాలు సొంతంగా తమ కాళ్లపై నిలబడ్డాయి. ఒక్క వనపర్తి పట్టణంలోనే ఈమె నిర్వహించిన సెంటర్ ద్వారా శిక్షణ పొందినవారిలో 500 మంది మహిళలు షాపులు పెట్టుకొని టైలరింగ్ పనులను చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి నేర్చుకున్న మహిళలు సైతం ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా టైలరింగ్ వృత్తిని కొనసాగిస్తున్నారు.
కాలానుగుణంగా కాలానుగుణంగా మహిళలు ధరించే వస్ర్తాల్లో అనేక మార్పులొచ్చాయి. పండుగులు, ఇతర పర్వదినాలతోపాటు పెండ్లిళ్ల్ల్లు, పుట్టిన రోజులు ఇలా అనేక ఫంక్షన్లకు మహిళలు కొత్తవస్ర్తాలను కోరుకుంటారు. ఇందుకోసం అనురాధ సెంటర్లోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. టైలరింగ్ మిషన్ల నుంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్, చీరలకు పెయింటింగ్, ప్రింటింగ్, శారీ రోలింగ్, ఫాలిసింగ్, అన్ని రకాల వెరైటీ డిజైన్లతో పనులు చేసేలా మార్పులు చేస్తూ యంత్రాలను ఏర్పాటు చేశారు. మహిళలకు కావాల్సిన అన్నిరకాల నూతన డిజైన్లను అందించేలా హారిక టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైన్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. చాలా మందితో కుట్టించుకున్నా..మాకు కుదరలేదని వచ్చే వారే ఇక్కడ అధికం. అనురాధ చేయి పడిందంటే డ్రెస్సుకు డిజైన్ అయినా, చీరలకు కలర్ పెయింటింగ్ సెలక్షన్ అయినా, చివరకు జాకెట్‌ను కుదిరించడమైనా అదిరిపోవాల్సిందే.
ఏ వృత్తిలోనైనా రాణించాలంటే కృషి పట్టుదల ఉండాలి. అతిసాధారణ జీవితం నుంచి వచ్చినా అసాధారణ సాంకేతిక నైపుణ్యంతో 30 ఏండ్ల్లుగా చేస్తున్న కృషి సత్ఫాలితాలనిచ్చింది. చిన్నపిల్లలు, బాలికలు, మహిళలకు కావాల్సిన అన్ని రకాల డిజైన్లను అందిస్తూ నమ్మకంగా పనిచేయడం ఇక్కడ ప్రత్యేకంగా నిలిచింది. వచ్చే ఆర్డర్లను చెప్పిన సమయానికంటే ముం దుగా ఇస్తూ ఖచ్చితమైన పని విధానాన్ని అనురాధ అనుసరిస్తుంది. వనపర్తి పట్టణంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు డిజైన్ దుస్తులు, వస్ర్తాలను ఇక్కడి నుంచి సిద్ధం చేయించుకుంటారు. పెండ్లి కూతురుకు సంబంధించినవి ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది. వెరసి 30ఏండ్లుగా నడిపిస్తున్న టైలరింగ్ వృత్తిలో నిరంతరాయంగా రాణిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.
మహిళలు ఎక్కువగా మగ్గం డిజైన్స్, పెయింటింగ్ వర్క్స్‌ను ఇష్టపడుతుంటారు. అలాగే బ్లౌస్లపై డిజైన్లు రెండు రకాలుగా వేయించుకుంటున్నారు. ఇది వరకు చేతితోనే మగ్గంపై పనిచేస్తూ డిజైన్‌ను వేసే పరిస్థితి ఉండేది. కాలానుగుణంగా కంప్యూటరైజ్డ్ యంత్రాలు వచ్చా యి. డిజైన్ ఎంపిక చేసి ఒక్కసారి కలర్ కాంబినేషన్ దారాలను ఎక్కిస్తే చాలు మనకు నచ్చిన డిజైన్ వచ్చేస్తుంది. ఈ ప్రాంతంలో ఒక్కో జాకెట్‌కు రూ.500 నుంచి రూ.10వేల వరకు డిజైన్లను బట్టి వెచ్చిస్తున్నారు. వీటితో పాటు చీరలకు ప్రింటింగ్, ప్రాక్స్, గాగ్రాచోళీ, పంజాబీలు కుట్టడంతోపాటు ప్రత్యేకంగా చీరలకు రోలింగ్, ఫాలిసింగ్, జాకెట్స్కు కంప్యూటర్, మగ్గం డిజైన్స్‌ను వేస్తున్నారు.
ప్రారంభంలో అనేక రకాలుగా తడబడుతూ చివరకు నిలబడ్డాం. టైలరింగ్ వృత్తిలో ఉన్న వారికి పండుగలుండవు. ఎందుకంటే అందరూ అదే సమయంలో కొత్త బట్టలు సిద్ధం చేసుకుంటారు. మేం ఆ పనిలోనే ఉంటాం. కష్టమర్లను ఇబ్బందికి గురిచేయకుండా ఉండ టం చాలా ముఖ్యం. చెప్పిన సమయానికి ఇవ్వడం కూడా ప్రాముఖ్యమే. ఈ రెండు మెయింటెనెన్స్ చేయకపోతే ఇంతలా మా సెంటర్ ఎదగడం కష్టం. నమ్మకంగా పని చేయడం ద్వారానే మార్కెట్లో మా పని ముద్ర ఉంది. చిన్న వస్త్రం నుంచి పెద్ద.. పెద్ద డిజైన్లతో కూడిన వాటన్నిటిని సెంటర్ ద్వారా నిర్వహిస్తాం. సెంటర్‌కు వచ్చిన కస్టమర్ వెనక్కి వెళ్లిపోవడం ఉండ కూడదన్న తరహాలో అన్నిరకాల డిజై న్లు, కంప్యూటర్లు, రోలింగ్ మిషన్, మగ్గం, ప్రింటింగ్‌లను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాం. ఏపనైనా నచ్చినట్లు నమ్మకంగా చేయడమే నేను నేర్చుకున్నా.