Siddipeta | మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉన్నది. దీంతో విద్యార్థినులు చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. కళాశాలలో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 90 మంది బాలికలు, 60 మంది బాలురు ఉన్నారు. వీరికి తోడు 15 మంది అధ్యాపకులు ఉన్నారు. వీరందరికీ కలిపి కళాశాల ఆవరణలో ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. దీంతో విరామ సమయంలో బాలికలు మరుగుదొడ్డి వద్ద క్యూలైన్ కట్టడం నిత్యకృత్యమైంది. బాలురు, అధ్యాపకులు మాత్రం ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్న ఒక్క మరుగుదొడ్డి సైతం శిథిలావస్థకు చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి పోయాయి. మరిన్ని మరుగుదొడ్లను నిర్మించి తమ ఇబ్బందులు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.