హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని చేపట్టింది. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లక్ష పోస్టుకార్డులు పంపించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని పలు కాలేజీలకు ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నదని, తక్షణమే ఈ తీర్పును పునఃసమీక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలని సీజేకు విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రధాన విద్యా కేంద్రాల నుంచి సీజేకు ఉత్తరాలు రాశారు. ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన కౌంటర్ దాఖలు చేయకపోవడంతోనే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కమీషన్ల కోసం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కోట్లలో బిల్లులు చెల్లిస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించిన బీఆర్ఎస్వీ, తాజాగా మూడు రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో సోమవారం వినతిపత్రాలు అందజేసిన నాయకులు, మంగళవారం పోస్టుకార్డు ఉద్యమం, బుధవారం రాష్ట్రంలోని అన్ని కళాశాలలను బంద్ చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఇప్పటికే పిలుపునిచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో పేద, బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందని గెల్లు విమర్శించారు. మొదటి విడతలోనే బకాయిలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హకు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదు’ అని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు.