హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం గొప్పగా ఆర్భాట ప్రచారం చేసుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకం.. ఆచరణలో విఫల పథకమంటూ విమర్శలు ఎదుర్కొంటున్నది. పథకం అమలు జరుగుతున్న తీరు ఇందుకు కారణంగా నిలుస్తున్నది. తమ ప్రభుత్వం 4.5 లక్షల ఇండ్లు ఇచ్చిందంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ 3.05 లక్షల ఇండ్లకు మాత్రమే పనులు మొదలైనట్టు పలు సందర్భాల్లో గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారికంగా చెప్తున్నారు. అందులోనూ లబ్ధిదారుల వద్ద డబ్బులు లేకపోవడం, ప్రభుత్వం బిల్లులు సమయానికి చెల్లించకపోవడంతోపాటు రకరకాల కారణాలతో మధ్యలోనే ఆగిపోయిన ఇండ్లు మరో లక్ష వరకు ఉన్నాయని అధికారులే చెప్తున్నారు. ఇవన్నీ పోగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు కేవలం 2 లక్షలు మాత్రమే.
చెప్పినదెంత.. చేస్తున్నదెంత?
ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వానికి 82 లక్షల దరఖాస్తులొచ్చాయి. 20 లక్షల మందికి ఇండ్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. మాటలు కోటలు దాటినా.. చేతలు గడప దాటలేదన్నట్టుగా పథకం అమలు తీరు కనిపిస్తున్నది. మంజూరైన 4.5లక్షల ఇండ్లలో 2 లక్షల ఇండ్ల పనులు నడుస్తున్నాయి. వీటిలో నిర్మాణం పూర్తి చేసుకునేవి ఎన్నో సందేహమే. ప్రభుత్వం దశల వారీగా రూ.5 లక్షలు ఇస్తామని చెప్తున్నది. దీంతో చాలామంది అప్పులు చేయాల్సి వస్తున్నది. ఒక్కో ఇంటి లబ్ధిదారుపై రూ.2 లక్షల మేర అదనపు భారం పడుతున్నది. ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేయకపోవడం, పనులు పూర్తయినా బిల్లుల మంజూరులో జాప్యంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కాంగ్రెస్ నాయకుల చేతివాటం
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇందిరమ్మ కమిటీల రూపంలో అక్రమాలకు తెరతీశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లోని చోటామోటా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనర్హుల పేర్లను జాబితాల్లో చేర్చి, ఆశ్రిత పక్షపాతం చూపారని, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా నుంచి 20 వేల మందిని కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి.. తొలగించింది. రాష్ట్ర ప్రభు త్వ అధికారులు కూడా 12వేల ఇండ్లు అనర్హులకు మంజూరైనట్టుగా నిర్ధారించి, తొలగించారు. పథకం అమలు జరుగుతున్నదే అరకొరగా.. అందులో అక్రమాలు.. ఇక పథకం ఎలా అమలువుతున్నదో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొర్రీలతో నీరుగారిన పథకం
ప్రభుత్వం 60 చదరపు అడుగులలోపు స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలని నిబంధన విధించింది. కొందరు పెద్ద ప్లాట్లను చిన్నవిగా చూపుతూ రెండు గదులు నిర్మాణం చేపట్టారు. మరికొందరు ఇందిరమ్మ ఇంటిని పెద్ద ఇంటిగా నిర్మించుకుంటున్నారు. విశాలమైన స్థలం ఉండి, సొంతంగా భవంతులు నిర్మించుకునే స్థోమత ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమేంటని అసలైన అర్హులు ప్రశ్నిస్తున్నారు. కొద్దిపాటి స్థలంలోనో, శిథిలావస్థలోని ఇంటిని కూల్చో.. రెండు గదుల ఇంటిని నిర్మించుకుంటామంటే కనికరించని పాలకులు.. అక్రమంగా బడాబాబులకు ఇండ్లు మంజూరు చేయడమేంటని నిలదీస్తున్నారు.
అరచేతిలో వైకుంఠం.. ఆచరణలో రిక్తహస్తం!
