మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 08: మంచిర్యాల జిలా కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొండపర్తి సందీప్ (26) అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం కావ్య అనే మహిళతో వివాహం జరిగింది. తన భార్యతో కలిసి శ్రీరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి సందీప్ తన తోడల్లుడైన ఓదెలకు చెందిన సుమన్‌తో కలిసి శ్రీరాంపూర్ నుండి మంచిర్యాలకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. కాలేజ్ రోడ్డు సమీపంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగగానే బైక్ అదుపుతప్పి డివైడర్ కు ఢి కొట్టడంతో కింద పడ్డారని తెలిపారు.
ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతిచెందగా సుమన్ కు తీవ్ర గాయాలైనాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని సందీప్ మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సుమన్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా ప్రస్తుతం సందీప్ ఐఎన్టీయూసి ఏరియా వైస్ ప్రెసిడెండ్ జెట్టి శంకర్ రావు దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూన్నాడు.