ఖైరతాబాద్, జనవరి 12: నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని అందుకున్నది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఆధునిక చికిత్సలు చేస్తున్న నిమ్స్ రోబోటిక్ సర్జరీల విభాగం.. వంద రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించింది. ఈ శస్త్రచికిత్సలన్నీ ఆరు నెలల కాలంలోనే చేయటం మరో రికార్డు. అందులో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (35), యూరాలజీ (48), సర్జికల్ ఆంకాలజీ (17) ఉన్నాయి. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప.. వైద్యుల బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో యూరాలజీ వైద్యులు ప్రొఫెసర్ రాహుల్ దేవ్‌రాజ్, ప్రొఫెసర్ రాంరెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ వర్మ, అనస్థీషియా ప్రొఫెసర్ నిర్మల, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
కేసీఆర్ సర్కారు ఫలమిది
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో గత ఏడాది రూ.32 కోట్లతో రోబోటిక్ సర్జరీ విభాగాన్ని నిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసింది. అందుకోసం 20 మంది సర్జర్లకు శిక్షణ ఇప్పించింది. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, ఆంకాలజీ, విభాగాల్లో రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చికిత్సలతో సమయం ఆదా అవటమే కాకుండా, కచ్చితమైన పరిష్కారం లభిస్తుంది.