ఖమ్మం, జూన్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనీసం వారిని లక్షాధికారులను కూడా చేయలేకపోయారని విమర్శించారు. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఎప్పుడు అమలుచేస్తారని ప్రశ్నించారు. ఆ హామీ ప్రకారం రాష్ట్రంలో 1.67 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో మహిళకు రూ.1.50లక్షలు జమ చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం ఎస్ఐఆర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణుల శిక్షణ, అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ తొలి ప్రభుత్వం అప్పులు చేసిందని కాంగ్రెస్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రంలో అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో పాటు సీతారామ ప్రాజెక్టును 80శాతం పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు వరప్రదాయినిగా మార్చామని వివరించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న ఈ రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4లక్షల కోట్ల అప్పుచేసిందని తెలిపారు. మరి ఈ అప్పులతో చేసిన అభివృద్ధి ఏమిటో, సాధించిన ప్రగతి ఏమిటో, ప్రజాసంక్షేమానికి వెచ్చించింది ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ 4లక్షల కోట్ల అప్పుతో రేవంత్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గుండుసున్నా అని విమర్శించారు.
అభివృద్ధి అంటే కూల్చివేతలా?
కాంగ్రెస్ పాపాల చిట్టాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కూల్చివేతలే ఉన్నట్టుగా ఉన్నదని విమర్శించారు. అందుకే వెలుగుమట్లలో వెయ్యి ఇండ్లను కూల్చారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డు వస్తున్నారనే వెలుగుమట్ల పేదల కడుపులో తన్నిన నీచ చరిత్ర సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ఉన్నదని ధ్వజమెత్తారు. సత్తుపల్లిలోని బుగ్గపాడులో ఫుడ్‌పార్కులో ఒక్కో ఎకరం స్థలాన్ని రూ.21లక్షలకే ఎందుకు అమ్మాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మార్కెట్ విలువ రూ.60 లక్షలు, టీఎస్ఐడీసీ విలువ రూ.40లక్షలు ఉన్నప్పటికీ అంత తక్కువకు ఎందుకు అమ్మారో చెప్పాలని నిలదీశారు. ఇందులో మంత్రి తుమ్మల ప్రయోజనం లేదా? అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.100 కోట్ల మట్టిని మంత్రి తుమ్మల అక్రమంగా తరలిస్తున్న విషయం ప్రజలకు తెలియనిది కాదన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ రోజురోజుకూ పడిపోతున్నా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం విస్తరిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు.
కమల్‌హాసన్‌ను మించిన ‘భట్టి’ యాక్టింగ్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నటన.. విశ్వనటుడు కమల్‌హాసన్‌ను మించి ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో హంగామా చేసిన భట్టి.. ‘బాండ్’ను తయారు చేసి ఇంటింటికీ పంపారని, వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మరి రెండున్నరేండ్లలో ఒక్కటైనా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మరి ఇప్పుడా కార్డులను ఎక్కడ భద్రపర్చుకోవాలో భట్టి సెలవియ్యాలని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు పవర్ ఉన్న ముగ్గురు మంత్రులమున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, కానీ జిల్లా ప్రజలకు ఒరిగిన ప్రయోజనం ఏమీలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నడుంబిగించి ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టును ఈ మంత్రులు ఇప్పటివరకు పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. పబ్లిసిటీ కోసమే సీతారామ నీటిని మంత్రి తుమ్మల నెత్తిన చల్లుకున్నారు తప్ప ఒక్క ఎకరానికీ సాగునీరు ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు.
కేసీఆర్‌కు గెలుపోటములు సమానం..
ప్రధాని పదవి తప్ప అన్ని రకాల పదవులనూ కేసీఆర్ నిర్వహించారని, ఆయనకు పదవీ వ్యామోహం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. గెలుపోటములను ఆయన సమానంగా చూస్తారని, గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం ఎప్పుడూ చేయలేదని జ్ఞప్తికి తెచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకోవడం వల్ల నష్టపోయిందెవరో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 11సార్లు రైతులకు పెట్టుబడి సాయం రూపంలో రూ.77వేల కోట్లు అందించిన ఘనత కేసీఆర్‌దని గుర్తుచేశారు. సీఎం రేవంత్ 72సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
రుణమాఫీని ఎందుకు పూర్తిచేయలేదు?
రేవంత్ సర్కార్ చేతగానితనం వల్లే రైతుల రుణమాఫీ నిధులు రూ.50వేల కోట్ల నుంచి రూ.26వేల కోట్లకు తగ్గాయని కేటీఆర్ ఆరోపించారు. రూ.50వేల కోట్లతో రాష్ట్రంలోని రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటికీ ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. తొలుత రూ.40 వేల కోట్లుగా, తర్వాత రూ.31 వేల కోట్లుగా, అసెంబ్లీలో రూ.26 వేల కోట్లుగా రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. కానీ, తాము రూ.20వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామంటూ మంత్రి తుమ్మల బహిరంగంగా ప్రకటించడంతో రుణమాఫీపై ప్రభుత్వ విధానం స్పష్టమైందన్నారు. ఇప్పటికీ మాఫీ అయిన రుణాలు రూపాయిలో 40 పైసలు మాత్రమేనని, 60పైసల మేర మాఫీ జరుగాల్సి ఉన్నదని చెప్పారు. మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన పాలకులెవరో ప్రజలకు తెలుసునని అన్నారు.
అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఏడు సన్న రకాలకే ఇస్తామంటున్నదని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో ఇది కూడా కొనసాగే అవకాశం ఉండదని అనుమానం వ్యక్తంచేశారు. ఈ నెల 30న మధిర సభలో రైతుబంధు వేస్తామని రేవంత్ చెప్పడం వెనుక ఏదో రాజకీయ ప్రయోజనం ఉన్నట్టు అనుమానం కలుగుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ నేతలు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, దిండిగల రాజేందర్, ఉప్పల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రైతుబంధుకు ఎగనామం..
రాష్ట్రంలో రైతుబంధుకు ఎగనామం పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఢిల్లీలో రాహుల్బంద్ను ప్రారంభించారని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రతినెలా మూటలు అందజేయడం ద్వారా తన కుర్చీని కాపాడుకుంటున్నారని విమర్శించారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రేవంత్.. ఈ రెండున్నరేండ్లలో కనీసం 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేసి వాటిని వారి ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో రూ.10వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు.
రైతులకు యూరియా కష్టాలు తెచ్చింది, యాప్ పేరుతో వాటిని మరింత పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అసలు షాప్‌లో లేని యూరియా యాప్‌లోకి ఎలా వస్తుందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రైతులను అష్టకష్టాలు పెట్టే ఈ యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో పడేస్తం.
– కేటీఆర్
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మంత్రులు ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూల్చారు. పేదల కడుపులో తన్నిన నీచ చరిత్ర సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులది. వారి విల్లాలకు వీళ్ల గుడిసెలు అడ్డొస్తున్నాయని తొలగించుకున్నారు. అందుకే ‘దుర్మార్గపు కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
– కేటీఆర్