హైదరాబాద్, నవంబర్2 (నమస్తే తెలంగాణ) : బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతుండటంపై ‘నమస్తే తెలంగాణ’ కథనంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. సంబంధిత అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. నూతన విద్యావిధానం-2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ(పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, విద్యాసంస్థలను అన్నిరంగాల్లో సమగ్ర పరివర్తనను ప్రోత్సహించేందుకు, ఆధునిక విద్యావసతుల కల్పనకు నిధులను సమకూర్చ డం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద నిధుల సాయానికి ఆన్లైన్ చాలెంజ్ పోర్టల్ ద్వారా నేరుగా యూడైఎస్ కలిగిన ప్రాథమిక, సెకండరీ, సీనియర్ సెకండరీ, కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల నుంచి కేంద్రమే దరఖాస్తులు స్వీకరించింది. 3 దశల వడపోత తర్వాత ఎంపికచేసిన 16వేలకు పైగా విద్యాసంస్థలకు ఈ పథకం కింద నిధులు సమకూరుతున్నాయి. తెలంగాణలో 794పైగా విద్యాసంస్థలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల నుంచి దాదాపు 85కుపైగా ఉన్నాయి.
ఎంపికైన స్కూళ్లకు ఏడాదికి దాదాపు రూ.10లక్షలకుపైగా నిధులను కేంద్రం మంజూరు చేస్తున్నది. నిధుల వినియోగంపై ఆడిట్ కొనసాగుతున్న గురుకులాల్లో మాత్రం ఆ పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు సొసైటీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వ నిధులపైనే ఆడిట్ చేయిస్తున్నది. కేంద్ర నిధులపై ఆడిట్ చేయించడం లేదు. దీంతో ఇదే అదునుగా ఆయా గురుకుల సొసైటీల ప్రిన్సిపాల్స్ అక్రమాలకు తెరలేపారు. బోగస్ బిల్లులతో నిధులు స్వాహా చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ గురుకులంలో వాటర్‌ట్యాంక్ మరమ్మతులకు లక్ష ఖర్చు చేసినట్టు బిల్లులు పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై ‘వాటర్ ట్యాంక్ రిపేర్‌కు లక్ష’ పేరి ట ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో పీఎంశ్రీని పర్యవేక్షిస్తున్న సమగ్రశిక్ష అధికారులు నిధుల దుర్వినియోగంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పీఎంశ్రీ అమలవుతున్న విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం మల్టీజోన్1లోని పీఎంశ్రీ విద్యాసంస్థల ఇన్చార్జీలు, సిస్టమ్ అనలిస్ట్‌లు, ప్లానింగ్, క్వాలిటీ కోఆర్డినేటర్లకు బంజారహిల్స్‌లోని ఆదివాసీభవన్‌లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 4న మల్టీజోన్ సిబ్బందికి నిర్వహించనున్నారు.