Medigadda Barrage | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీబరాజ్) ఎలా కుంగిపోయింది? అందుకు కారణం ఏమిటి? సాంకేతిక తప్పిదమా? నిర్మాణ వైఫల్యమా? ఎక్కడ లోపం జరిగింది? ఏం జరిగింది? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఫీల్డ్ ఇన్వేస్టిగేషన్ చేయడమే మార్గం. బరాజ్ పునాదిని తవ్వి పరిశీలించాల్సిందే. బరాజ్ నిర్మాణాలను తనిఖీ చేయాల్సిందే. ఆ తర్వాత సాంకేతిక అంశాలతో సరిపోల్చి చూసి ఎక్కడ లోపం జరిగిందో నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలను నిర్ణయించాల్సి ఉంటుంది. సూటిగా చెప్పాలంటే చికిత్స ప్రారంభానికి చేసే రోగనిర్ధారణ పరీక్ష ఎంత ముఖ్యమో మేడిగడ్డ బరాజ్ ఫీల్డ్ ఇన్వేస్టిగేషన్ కూడా ఇప్పుడు అంతే ముఖ్యం. అది పూర్తయితే తప్ప కారణాలపై అంచనాకు రాలేమని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి
7వ బ్లాక్‌లోని పిల్లర్ల కింద అర్గతంగా కొనసాగిన నీటిప్రవాహం వల్ల ఇసుక, మట్టి కోతకు గురవడం వల్లనే మేడిగడ్డ బరాజ్ కుంగినట్టు ఇంజినీరింగ్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనితోపాటు ఆ ప్రాజెక్టును సందర్శించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందంలోని అధికారులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. బరాజ్‌ను పునాది వరకు తవ్వి పరీక్షించకపోతే కుంగుబాటుకు వాస్తవ కారణాలు తెలియవని వెల్లడించారు. బరాజ్‌లోని సంక్లిష్ట నిర్మాణాల్లో సీపేజ్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. దీనిలో భాగంగా చేపట్టిన సీకెంట్ లేదా షీట్ పైల్స్ నిర్మాణాలు, బరాజ్ ఫౌండేషన్, బేరింగ్ కెపాసిటీతోపాటు బరాజ్ ఎగువ, దిగువన చేపట్టిన నిర్మాణాలు కూడా అనేక సంక్లిష్టతలు, సవాళ్లతో కూడినవే. క్షేత్రస్థాయి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా డిజైన్లలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఈ నిర్మాణాలను కొనసాగించాల్సి ఉంటుంది. దీనికి ముందస్తుగా అనేక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇసుక పొరల కదలిక వల్ల 7వ బ్లాక్‌లోని పిల్లర్లు కుంగుబాటుకు గురైనట్టు ప్రాథమింకగా అంచనా వేసినా వేసినప్పటికీ.. బరాజ్‌లోని మిగిలిన బ్లాకుల పిల్లర్ల వద్ద లేని సమస్య కేవలం 7వ బ్లాక్‌లోనే ఎందుకు వచ్చిందన్న విషయాన్ని తేల్చాల్సి ఉన్నది. అందుకోసం 7వ బ్లాక్‌ను పునాది వరకు తవ్వి అక్కడ చేపట్టిన నిర్మాణాలను, సీపేజీ వ్యవస్థలను పరిశీలించడం ద్వారా డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం జరిగిందో లేదో తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ పరిశీలనలో తేలిన అంశాలన్నింటినీ క్రోడికరించాకే బరాజ్ కుంగుబాటుకు వాస్తవ కారణాలు వెల్లడవుతాయని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు.
ఇన్వేస్టిగేషన్ కోసం మొదలైన పనులు
బరాజ్ కుంగుబాటుకు కారణాలను తెలుసుకోవడంలో భాగంగా ప్రస్తుతం ఫౌండేషన్ ఇన్వేస్టిగేషన్ చేపట్టేందుకు నిర్మాణ ఏజెన్సీ ఎల్అండ్టీ చర్యలు చేపట్టింది. ఈ ఇన్వేస్టిగేషన్ చేపట్టాలంటే బరాజ్ కుం గుబాటుకు గురైన ప్రాంతంలో నీరు లేకుండా చే యాలి. అందుకోసం ఎగువన కాఫర్ డ్యామ్‌ను ని ర్మించాల్సి ఉండటంతో దాదాపు రూ.55 కోట్లతో అంచనాలను రూపొందించి ఇప్పటికే ఆ పనులను చేపట్టింది. ప్రస్తుతం అందుకు కావాల్సిన మెటీరియల్‌ను తరలించే వాహనాల రాకపోకలకు అనువుగా రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ నెల 27 నుంచి కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తం 1,672 మీటర్ల పొడవైన మేడిగడ్డ బరాజ్‌లో 8 బ్లాకులు, ఒక్కో బ్లాక్ లో 11 పిల్లర్లు ఉన్నాయి. దీంతో కాఫర్ డ్యామ్‌ను 4 లేదా 5వ బ్లాక్ వరకు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తున్నది. కాఫర్ డ్యామ్ నిర్మా ణం తర్వాత డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ బరాజ్ కుంగుబాటు కారణాలను అన్వేషించనున్నది.
29న మంత్రుల పర్యటన
ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 29 ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వెళ్లి మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, దాని వల్ల జరిగిన లాభ, నష్టాలు, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల సమస్యలు, వాటి పరిషారాలు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. అనంతరం అన్నారం బరాజ్‌ను పరిశీలించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలు, సబ్-కాంట్రాక్టర్లతోపాటు నిర్మాణంలో సంబంధం ఉన్న వారందరికీ సమాచారం ఇవ్వాలని, అందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఆధ్వర్యంలోనే
ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్‌లోని పిల్లర్ కుంగుబాటునకు గల కారణాలపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఇన్వేస్టిగేషన్‌ను కొనసాగించనుంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం.. ప్రతి రాష్ట్రం స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆయా రాష్ర్టాల్లోని డ్యామ్‌లను సమగ్రంగా ఆడిట్ చేయడంతోపాటు ఏదైనా డ్యామ్‌కు నష్టం వాటిల్లిప్పున క్షేత్రస్థాయి పరిశీలనతో కారణాలను నిగ్గుతేల్చి తదుపరి చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలపై సిఫారసులు చేసేందుకు ఇంజినీర్లతోపాటు హైడ్రాలజీ, జియాలజీ, డిజైన్ రంగాల్లోని నిపుణులతో డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఏబీ పాండ్యా నేతృత్వంలో 8 మంది నిపుణులతో డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ ప్యానల్ మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించి ప్రాథమికంగా పలు అంశాలను గుర్తించింది. ప్రస్తుతం ఆ బృందమే బరాజ్ కుంగుబాటు కారణాలపై పూర్తిస్థాయి ఇన్వేస్టిగేషన్ కొనసాగించనున్నది. వాస్తవ కారణాలను నివేదించడంతోపాటు, తదుపరి చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలను కూడా ఈ బృందమే సిఫారసు చేయనున్నది.