Fee Reimbursement | హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇక నుంచి ఉన్నతవిద్య దూరం కానున్నదా? ప్రైవేట్ కళాశాలల్లో చేరడం కలగానే మిగలనున్నదా? రేవంత్ సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టేనా? కాలేజీ యాజమాన్యాలు, సర్కార్ మధ్య బలహీనవర్గాలు బలవుతున్నాయా? అంటే అవుననే సమాధానాలే సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌కు సంబంధించి సర్కార్ తెచ్చిన నూతన మార్గదర్శకాలు సైతం అదే నిజమని నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి, వివిధ కులసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధుల చెల్లింపును పూర్తిగా నిలిపేసింది. దాదాపు రూ.10వేల కోట్లకు పైగా నిధులు బకాయిలు ఉన్నాయని తెలుస్తున్నది. ఆ బకాయిల చెల్లింపు ఊసే ఎత్తడం లేదు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. అందుకోసం జీవో 7ను విడుదల చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి కాలేజీల ట్యూషన్ ఫీజులను విద్యార్థులకే చెల్లిస్తామని ఆ జీవోలో పేర్కొన్నది. విద్యార్థులకు చెల్లించిన తర్వాతే కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయాలని షరతు విధించింది. కానీ ఎప్పుడు చెల్లిస్తామనే దానిపై కచ్చితమైన టైమ్‌లైన్ మాత్రం అందులో పేర్కొనలేదు. వాస్తవంగా ఫీజు రీయింబర్స్మెంట్, 3 నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో సాలర్షిప్లు చెల్లించాలనేది గత నిబంధనలు. విద్యా సంవత్సరం ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం, చివర్లో మరో 25 శాతం చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ఆ రకంగానైనా విద్యార్థులకు నేరుగా చెల్లిస్తామని సర్కార్ ఎక్కడా ఆ జీవోలో పేర్కొనలేదు. ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్లే కాలేజీలు ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యార్థులకు సైతం సకాలంలో చెల్లించకపోయినా అదే పరిస్థితి వస్తుందనేది విద్యార్థి, కులసంఘాల వాదన.
ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందనందున కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాతన పెడతున్నాయి. ఈ దశలో నూతన మార్గదర్శకాల ప్రకారం ఫీజులు చెల్లించకుంటే అడ్మిషన్లు ఇస్తాయా? అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. పెడుతున్నాయి. ఉన్నత విద్య పూర్తయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వడమే లేదు. టీసీలు జారీ చేయడంలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వచ్చాకే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసి చెప్తున్నాయి. దీంతో అప్పులు చేసి కొందరు, సొంతంగా జేబుల నుంచి మరికొందరు విద్యార్థులు కాలేజీల ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొన్నది.
కాలేజీ యాజమాన్యాల ఇబ్బందులపై పలువురు బాధిత విద్యార్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో, సర్టిఫికెట్లు ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం సైతం పలు సందర్భాల్లో బెదిరింపులకు సైతం దిగింది. అయినా కాలేజీ యాజమాన్యాలు ఫీజుల విషయంలో రాజీపడలేదు.. విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చిందీ లేదు. అదీగాక కాలేజీ యాజమాన్యాలకు అనుకూలంగానే హైకోర్టు సైతం గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని తేల్చిచెప్పింది. ఈ పరిస్థితుల్లో ఫీజులు చెల్లించనిదే అడ్మిషన్లు ఇస్తాయా? అని వి ద్యార్థి, కులసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.