మోతె, జూన్ 13 : తన భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో నిరసనకు దిగింది. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
బాధితురాలు ఎర్ర కమలమ్మ కథనం ప్రకారం.. మోతె మండలం రావిపహాడ్‌కు చెందిన కమలమ్మ, పెద్ద వెంకట్‌రెడ్డి దంపతులకు సంతానం లేదు. దాంతో కమలమ్మ అక్క కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిని సాదుకుంటూ చదివించారు. 2016లో తన భర్త బతికి ఉన్నప్పుడు శ్రీనివాస్‌రెడ్డి 15 ఎకరాలు మోసపూరితంగా గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడని కమ్మలమ్మ వాపోయింది.
ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆ భూమిని తనకు ఇప్పించాలని పలుమార్లు అధికారులను ప్రాథేయపడినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేసింది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా 8 నెలల్లో పట్టా మార్పిడి చేయిస్తానని చెప్పి మాట మారుస్తున్నాడని పేర్కొంది. అక్రమంగా చేయించుకున్న పట్టాను రద్దు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాపోయింది. తహసీల్దార్ సంఘమిత్ర స్పందిస్తూ భూ సమస్యను న్యాయస్థానంలో తేల్చుకోవాలని, ఆర్ఐతో విచారణ చేయిస్తామని నచ్చజెప్పి వృద్ధురాలి ఆందోళనను విరమింపజేశారు.