సికింద్రాబాద్, జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను అమలు చేయాలని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)ప్రతినిధులు శనివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కోరారు. ఔటా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ మల్లేశం నేతృత్వంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి, రానున్న బడ్జెట్లో సీపీఎస్ పెన్షన్ కోసం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. ఔటా బృందం మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో ప్రొఫెసర్ సరస్వతమ్మ, ఔటా కోశాధికారి చలమల్ల వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి రాధాకృష్ణ, సీపీఎస్ సాధన సమితి ప్రతినిధులు శ్రీనివాస్, ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ప్రొఫెసర్ మంగు, సాధన, నర్సింహ, రవీందర్‌రెడ్డి ఉన్నారు.