హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీనివ్వాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ గంగాపురం స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ అంశాన్ని తమ మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. దేశంలోని 84 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ను రద్దుచేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ విధానం అమలు కొరకు రాష్ట్రంలోని 2 .30 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాయని తెలిపారు. దేశంలోని 84 లక్షల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించలేని పీఎఫ్ఆర్డీఏ చట్టం నుండి ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.