Congress | హైదరాబాద్, జనవరి19 (నమస్తే తెలంగాణ): గాంధీ కుటుంబాన్నే నమ్ముకొని కాంగ్రెస్ జెండాను మోసిన అసలైన నేతలను పక్కకు నెట్టి, జెండాలు మార్చిన వలస నేతలు రాత్రికి రాత్రే నామినేటెడ్ పోస్టులను ఎగురేసుకుపోన్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఏపీ జితేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి గెలిచి గోడ దూకిన అరెకపూడి గాంధీ, గుత్తా అమిత్‌రెడ్డికి వెంటనే పదవులు దక్కాయి. టీడీపీ నుంచి వలస వచ్చిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేయడంపై పాత కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి, అసెంబ్లీ టికెట్లు త్యాగం చేసిన నేతలకు తొలి ప్రాధాన్యంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఏఐసీసీతోపాటు కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయ కమిటీ ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక వలస వాదుల పెత్తనం పెరిగి తమను కరివేపాకును తీసినట్టు తీసివేస్తున్నారనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఆవేదన వ్యక్తంచేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మరో వలస నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారని, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటున్నా తమను పట్టించుకోవడమే లేదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. బాలల హ క్కుల కోసం కనీసం 10 ఏండ్లు పనిచేసిన వా రు కానీ, బాలల హక్కుల కోసం ఎన్జీవో నడిపిన వాళ్లు మాత్రమే ఈ పదవికి అర్హులని, సీ తాదయాకర్కు రాజకీయ పునరావాసం కో సమే పదవి ఇవ్వజూస్తున్నారని న్యాయవాది జయాకర్రావు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి లోక్‌సభ టికెట్ దక్కలేదని ఓ బీఆర్ఎస్ నేత, తన కొడుకుతో కలిసి కాంగ్రెస్‌లో చేరారని, ఆయన పార్టీలోకి వచ్చి రెండు నెలలు కాకముందే కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారని సూర్యాపేటకు చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పదవి ఇవ్వడంపైనా స్థానిక కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
నిరుడు మార్చిలో ప్రభుత్వం నియమించిన 37 గ్రేడ్-1 క్యాటగిరీ కార్పొరేష చైర్మన్ల నియామకంలో అత్యధికులు వలస కాంగ్రెస్ నేతలే అని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ జాబితాలో ప్రక్షాళన జరగాలని, పునర్నియామకాలు జరపాలని కోరుతూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదులు చేశామని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు నమస్తే తెలంగాణకు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో సుమారు 60 పదవులను భర్తీ చేసే అవకాశమున్నదని, ఆ పదవుల కోసం 200 నుంచి 250 మంది నేతలు ఆశలు పెట్టుకున్నారని చెప్తున్నారు. ఈ దఫాలోనైనా అసలైన కాంగ్రెస్ వాదులకు పదవులు దక్కాలని నేతలు ఏఐసీసీకి పెద్దలకు మొర పెట్టుకుంటున్నారు.