చెన్నూర్ రూరల్, మే 9 : మూడేండ్ల క్రితం నాటుకున్న మొక్కలు ఇప్పుడు కోతకు రావడంతో ముప్ఫై ఏండ్ల వరకు ఫలం ఇవ్వనున్నది. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ ప్రోత్సాహం, అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో నాటిన ఆయిల్‌పామ్ మొక్కలు ఇప్పుడు కోతకు రావడంతో ఆ రైతు ఆనందంలో మునిగిపోయాడు. వివరాలు ఇలా.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగాపూర్‌కు చెందిన రైతు అన్నల తిరుపతి-మానస దంపతులు తమకున్న ఆరెకరాల్లో మూడేండ్ల క్రితం ఆయిల్‌పామ్ తోటను సాగు చేశారు.
ఇప్పుడు పంట చేతికి రాగా శుక్రవారం కుటుంబ సభ్యులు, స్థానిక రైతులు, మ్యాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు సమక్షంలో పండుగ వాతావరణంలో కోత ప్రారంభించారు. మూడేండ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ ప్రోత్సాహంతో పంట సాగు చేయగా, ప్రస్తుతం గెలలు వచ్చాయని, పంట వేసిన మూడేండ్ల నుంచి 30 ఏండ్ల వరకు దిగుబడులు సాధించవచ్చని రైతు తిరుపతి ఆనందంతో వ్యక్తంచేశారు. ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పించి ప్రోత్సహించినందుకుగాను బాల్క సుమన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాట్రిక్స్ కంపెనీ సీఈవో ఉదయ్‌కుమార్, కంపెనీ ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
పామాయిల్ సాగుతో మూడేండ్ల నుంచి 30 ఏండ్ల వరకు దిగుబడులు సాధించి ఆదాయం పొందవచ్చని మ్యాట్రిక్స్ కంపెనీ సీఈవో ఉదయ్‌కుమార్ తెలిపారు. ఎకరంలో సుమారు 50 మొక్కలు నాటవచ్చని, మూడే ండ్ల తర్వాత పంట చేతికొస్తుందని పేర్కొన్నారు. మూడేండ్ల తర్వాత ఏటా ఎకరంలో సుమారు 10 టన్ను ల దిగుబడి (రూ.2 లక్షల ఆదాయం) వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2000 ఉన్నట్టు తెలిపారు.