సిద్దిపేట : రైతులంతా ఆయిల్ ఫామ్‌ను పెద్ద ఎత్తున సాగు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు రైతులకు పిలుపు నిచ్చారు. గురువారం దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామంలో 50 మంది డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం పోతరెడ్డిపేట క్లస్టర్ రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత వంటనూనె ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి.
ఈ మధ్యకాలంలో మలేషియా, ఇండోనేషియాలు ఆయిల్ ఫామ్ ఎగుమతి నిషేధించాయి. కారణం వంటనూనె ధరల పెంపు, తమదేశ ప్రజలకే వంటనూనె అవసర రీత్యా ఆయా దేశాలు వంటనూనె ఎగుమతిని నిషేధించాయన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో వంటనూనెలకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడుతున్నదని మంత్రి తెలిపారు. దీంతో ఆయిల్ ఫామ్ సాగుకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు.
ఆయిల్ ఫామ్ చాలా లాభసాటి పంట. ఆయిల్ ఫామ్ పంటలో చీడ పీడ బాధ లేదు. పందులు, కోతుల బెడద లేదు. గెల, కమ్మ కొట్టడమే.. పాడి బర్రె తరహాలోనే నెల నెలా డబ్బులు ఆర్జించొచ్చు. యేటా ఖర్చులు పోనూ లక్షా 50 వేలు మిగులు బాటు ఉంటుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు ధర రాదని, కొనుగోళ్లు జరగవనీ అనుమానం అక్కరలేదన్నారు. దేశంలో 10 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశం ఉంది. ఈ దరిమిలా సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ నర్సరీ పెట్టి 20 వేల ఎకరాలకు సరిపడేలా తోటలు పెంపకం చేస్తున్నామన్నారు.
వచ్చే జూలై నెల నుంచి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయిల్ ఫామ్ రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. మొన్నటి బడ్జెట్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం వెయ్యి కోట్లు ప్రవేశపెట్టినట్లు వివరాలను వెల్లడించారు. ఆయిల్ ఫామ్ సాగు కోసం ముందుకొచ్చిన రైతులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ ఫామ్ సాగు కోసం ముందుకొచ్చే రైతులను ప్రోత్సహించాలని, ఇప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.వ్యవసాయానికి కావాల్సిన అన్ని వసతులు సమకూర్చాలన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు బెడద లేకుండా చూడాలని, పత్తి సాగు, సెరి కల్చర్ ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.