హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గతుకుల రోడ్డు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. రోడ్లను అద్దాల్లా మెరిపించేందుకు కోట్లు కుమ్మరిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు బూటకమని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రోడ్ల సమస్యకు సర్వరోగ నివారిణి ‘హ్యామ్’ (హైబ్రిడ్ యాన్యూటీ మోడల్) అన్నట్టు ఆ ప్రాజెక్టు జపం చేస్తున్న సర్కార్, వర్షాలకు పాడైపోయిన రోడ్లను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హ్యామ్ ప్రాజెక్టు మొదలయ్యేలోపు కనీసం మరమ్మతులైనా చేయాలని ప్రజలు కోరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. కేంద్రం నుంచి నిధులు వస్తే తప్ప రోడ్లు బాగయ్యే పరిస్థితిలేదని అధికారవర్గాలు చేతులెత్తేశాయి.
గత ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని దాదాపు 9వేల కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.53.76 కోట్లు, శాశ్వతంగా పునరుద్ధరించేందుకు రూ.1,157 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే, ప్రభుత్వం కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టింది. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ర్టానికి వచ్చిన కేంద్ర బృందానికి ప్రతిపాదన సమర్పించి చేతులు దులుపుకున్నారు.
ముందుకురాని కాంట్రాక్టర్లు
ఇదిలావుండగా, రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ ద్వారా మొదటి దశలో రూ.11,399 కోట్లతో 5,824కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే, ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందో, లేదోనని కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో హ్యామ్ ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నది.