Indiramma Illu | హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): ‘ఇల్లు లేనివారికి ఇల్లు, స్థలం కూడా లేనివారికి స్థలంతోపాటు ఇల్లు.. 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు..’- ఇదీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ. కానీ, ప్రస్తుతానికి స్థలాలు ఉన్నవారికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. స్థలాలు లేనివారు లక్షలాదిమంది ఉండగా, వారికి మిగిలిపోయిన లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ పథకం కింద సుమారు 82 లక్షల దరఖాస్తులు రాగా, మొదటి విడతలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని 4.5 లక్షల మందికి ఇండ్లు మంజూరుచేశారు. ఇందులో సుమారు 2.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి.
సొంత స్థలాలు లేనివారికి ఇంటి స్థలంతోపాటు ఇంటిని కూడా మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. అందుకు అవసరమైన స్థలాలను ఎంపికచేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. చాలావరకు జిల్లాల్లో ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాలు లేవని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టి, పూర్తికాకుండా మిగిలిపోయిన సుమారు లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్థలాలు లేనివారికి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాల్లో విద్యుత్తు, డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఇటీవలే ప్రభుత్వం రూ.391.23 కోట్లు విడుదలచేసింది. పనులు పూర్తయ్యాక ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపికచేసి కేటాయించాలని నిర్ణయించారు.
మొత్తం దరఖాస్తుల్లో సుమారు 10 లక్షల దరఖాస్తులను ఇండ్లు పొందేందుకు అర్హతలేనివిగా అధికారులు తేల్చారు. ఇందులో ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి ఇదివరకే లబ్ధిపొందినవారు ఉన్నారు. వీరుపోగా మిగిలిన 72 లక్షల దరఖాస్తుల్లో దాదాపు సగంమంది ఇంటిస్థలంతోపాటు ఇల్లు కావాలని కోరుతున్నారు. అంటే, దాదాపు 30 లక్షల పైచిలుకు దరఖాస్తుదారులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించాల్సి ఉన్నది. మరో 35 లక్షల మంది స్థలం ఉండి ఇంటి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వం స్థలాలు ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో కేవలం 4.5 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయగా, స్థలంతోపాటు ఇల్లు కూడా కావాలని కోరినవారికి కేవలం లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టాలని చూస్తున్నది. హామీ మాత్రం 20 లక్షల ఇండ్లకు! కానీ వాస్తవానికి ఇస్తున్నది 6 లక్షలమందికి మాత్రమే. అంతేకాదు, మంజూరుచేసిన 4.5 లక్షల ఇండ్లలో నిర్మాణం జరుగుతున్నవి 2.5 లక్షలే. మిగిలిన రెండు లక్షల ఇండ్లు వివిధ కారణాలతో ఇంకా మొదలుకాలేదు. దీన్నిబట్టి ప్రభుత్వం లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో కలుపుకొని ఇవ్వబోయేది కేవలం నాలుగు లక్షల ఇండ్లు మాత్రమేనని స్పష్టమవుతున్నది.
గత ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వకుండా మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1.5 లక్షలు