ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జనాకర్షక పథకాలు అమలు చేయడంతో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పింది. దీనికి అధికారులు జవాబు చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక్కో అధికారిపై 3,4 వేల కేసులున్నాయి. ఇలాగైతే వాళ్లను జీవితాంతం జైలులోనే ఉంచాల్సి వస్తుంది. సందీప్‌కుమార్ సుల్తానియాపై వందకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే.. ఏ అధికారీ ఏమీ చేయలేరు. రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏమీ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది
ఓ కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా గురువారం హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పులతో ప్రభుత్వాధికారులు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తున్నదని మండిపడింది. ఆచరణ సాధ్యం కాని రీతిలో ఉచిత పథకాలు ఉంటున్నాయని, వాటి ఫలితంగా మున్ముందు ఆర్థిక అత్యవసర పరిస్థ్థితి తలెత్తే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేసింది. ‘కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి.. ఆఖరికి కుబేరుడైనా పనికి ఆహార పథకం కింద కూలిపనికి పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది’ అని జస్టిస్ నగేశ్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు.
కంటోన్మెంట్ బోర్డుకు నిధులు విడుదల చేయాలని రెండేండ్ల క్రితం హైకోర్టు ఆదేశించినా, అమలు చేయలేదని పేర్కొంటూ దాఖలైన కేసులో కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రభుత్వం చేస్తున్న తప్పులకు, అధికారుల ఆవేదనకు, ఉచిత పథకాల అనర్థానికి అద్దం పట్టాయి.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పే ప్రమాదం నెలకొన్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులతో అధికారులు తిప్పలు పడుతున్నారని మండిపడింది. ఈ స్థాయిలో ఉచిత పథకాలు ఇస్తే కుబేరుడు కూడా కూలి పనులు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా, ధర్మకర్తగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. అప్పులు తీర్చడం కోసం ఆస్తులను అమ్మే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికింది. కంటోన్మెంట్ బోర్డుకు రూ.33.42 కోట్ల నిధులు విడుదల చేయాలంటూ హైకోర్టు 2024లో ఉత్తర్వులు ఇవ్వగా, వాటిని అమలు చేయడం లేదంటూ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జే రామకృష్ణ హైకోర్టులో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం విచారణ చేపట్టారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు.
రూ.24 కోట్లు గత మే నెలలో చెల్లించామని, మిగతా సొమ్మును వాయిదాల పద్ధతిలో ఆరు నెలల్లో చెల్లిస్తామని సుల్తానియా చెప్పారు. ఈ దశలో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కోర్టు ఉత్తర్వులు ఇచ్చి రెండేండ్లయినా అమలు చేయలేదని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇన్ని ఉచిత పథకాలను అమలు చేయడంపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సమాజంలో మన బాధ్యత ఏమిటి? మనకు వచ్చే ఆదాయం ఎంత? బయటికి వెళ్తున్నది ఎంత? అనేది అధికారులు చూడాల్సి ఉంటుందన్నారు. ‘రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ఖర్చుల మధ్య తీవ్ర వ్యత్యాసం నెలకొన్నది. సమతుల్యత దెబ్బతింటున్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు ఏమి మిగులుతుందో ప్రభుత్వం ఆలోచించాలి’ అని సూచించారు. తనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ర్టానికి రూ.3.74 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నదన్నారు. ఇందులో రూ.2.74 లక్షల కోట్లు బయటికి వెళుతున్నాయని, జీతాలు, అప్పులకు రూ.1.50 లక్షల కోట్లు చెల్లించాల్సిన ఆర్థిక పరిస్థితి నెలకొన్నదని చెప్పారు.
ఇక మిగిలింది రూ.90 వేల కోట్లు మాత్రమే అని, ఇందులో రూ.89 వేల కోట్లను ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్నదని తెలిపారు. జనాకర్షణ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను తీవ్రంగా తప్పుబట్టారు. అర్హతల పరిశీలనలో లోపాలు ఉన్నాయని చెప్పారు. ‘నిలబడితే డబ్బు, కూర్చుంటే డబ్బు అన్నట్టుగా పథకాలు అమలవుతున్నాయి. పల్సర్ బైక్‌పై, ఐఫోన్ మాట్లాడుతూ ఉచిత బియ్యం కోసం వెళ్తున్నారు. నిజంగానే పేదవాడికి ఉచిత పథకాలు అమలు చేయాల్సిందే. దీనిని ఎవరూ తప్పు పట్టలేరు. అయితే అనవసరమైన ఉచిత పథకాలు అమలు చేయడం ఎంతవరకు సబబు? కోటీశ్వరులకూ రైతుబంధు ఇవ్వడం వల్ల ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతున్నది? ప్రభుత్వంపై ఇంత భారం పడితే ఎలా? భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుంది? మన పిల్లలకు ఏమి ఇస్తున్నాం?’ అని వ్యాఖ్యానించారు. ఎలా పడితే అలా పరిమితికి మించి ప్రభుత్వాలు పథకాలను అమలు చేయడం వల్ల భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఈ దేశానికి మనం ఏమిచ్చాం అని ప్రశ్నించుకునేవారని, ఇప్పుడు మాత్రం అంతకు భిన్నంగా ఈ దేశం మనకేమి ఇస్తున్నదని ప్రశ్నించుకునే దుస్థితి నెలకొన్నదని వాపోయారు.
రాష్ట్రంలో నిలబడితే డబ్బు, కూర్చుంటే డబ్బు అన్నట్టుగా పథకాలు అమలవుతున్నాయి. పల్సర్ బైక్‌పై, ఐఫోన్ మాట్లాడుతూ ఉచిత బియ్యం కోసం వెళ్తున్నారు. నిజంగా పేదవాడికి ఉచిత పథకాలు అమలు చేయాల్సిందే. దీనిని ఎవరూ తప్పు పట్టలేరు. అయితే అర్హతల పరిశీలనలో లోపాలున్నాయి. అనవసరమైన ఉచిత పథకాలు అమలు చేయడం ఎంతవరకు సబబు? ప్రభుత్వంపై ఇంత భారం పడితే ఎలా? భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుంది? మన పిల్లలకు ఏమి ఇస్తున్నాం?
ప్రజా ఆస్తులకు ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించి, రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అప్పులు తీర్చడం కోసం ఆస్తులను అమ్మే పరిస్థితి రావడం శోచనీయం. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. అనర్హులకు దీర్ఘకాలం ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఆచరణ సాధ్యం కాని రీతిలో ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఇలాగే కొనసాగితే సమాజం ప్రమాదంలో పడుతుంది. ఇన్ని ఉచిత పథకాలు అమలు చేస్తూ పోతే కుబేరుడు అయినా పనికి ఆహార పథకం కింద కూలీకి వెళ్లాల్సిందే.
అప్పు చేసి ఎవరైనా బెంజ్ కారు కొంటారా? ఎర్రబస్సులో వెళ్లే వాళ్లు ఎయిర్ బస్సులో వెళ్తామంటే ఆ కుటుంబం ఎంతకాలం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది? ఆ కుటుంబం ఎంత కాలం నిలబడుతుంది? 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.03 కోట్ల కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తుంటే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారు? ఉచిత పథకాల అమలు ఎంతవరకు సాధ్యమో ప్రభుత్వాలే తెలుసుకోవాలి. వాటిని అర్హులకు మాత్రమే అమలుచేయాలి. అనర్హులకు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

చాలామంది కూర్చొని ప్రభుత్వ పథకాలు అందుకుంటూ కాలం గడుపుతారని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఒక్క తెల్లకార్డునైనా తొలగించగలరా? అలా చేయగలిగే పరిస్థితి ఉన్నదా? అని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘అనర్హుడి నుంచి తెల్ల రేషన్ కార్డును తొలగిస్తే, అదో రాజకీయ దుమారానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు మాత్రం ఏం చేస్తారు. ఒక్కో అధికారిపై 3-4 వేల కేసులున్నాయి. ఇలాగైతే ఆయనను జీవితాంతం జైలులోనే ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుత అధికారిపై (సందీప్‌కుమార్ సుల్తానియా) వందకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ వ్యవహార తీరు ఇలా ఉంటే.. ఏ అధికారీ ఏమీ చేయలేరు. రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏమీ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది’ అని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ ఉపన్యాసం కాదని, ఆవేదనతో చెప్తున్నానని స్పష్టంచేశారు. గ్రామాల్లోకి వెళ్తే కూలీలు దొరక రైతులు అగచాట్లు పడుతున్నారని, ఏడుపు ఒకటే తకువన్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలు ఇకడికి వచ్చి వ్యవసాయ పనులు పూర్తి చేయాల్సి వస్తున్నదని తెలిపారు. అయినా మనం ఏ పనీ చేయడంలేదని ఎద్దేవా చేశారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ‘మనుషులు పనిచేసేవారట!’ అని చెప్పుకొనే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఉచిత పథకాల కింద వచ్చే సొమ్ములతో కొందరు కాలుమీద కాలు వేసుకుని బతుకుతుంటే, ఉద్యోగులు కూడా ఉద్యోగాలు మానేసి ‘మాకు ఉచిత పథకాలు కావాలి’ అని కోరే ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పారు. ఉచితాలపై ఆధారపడే మనస్తత్వం పెరిగితే సమాజం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.
అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం భూములను విక్రయిస్తున్నదని, మరి భవిష్యత్తు తరాల పరిస్థితి ఏమిటని జస్టిస్ నగేశ్ భీమపాక ప్రశ్నించారు. ప్రజా ఆస్తులకు ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించి, రక్షించాల్సిన బాధ్యత ఉంటుందని, కానీ అప్పులు తీర్చడం కోసం ఆస్తులను అమ్మే పరిస్థితి రావడం శోచనీయమని వాపోయారు. అనర్హులకు దీర్ఘకాలం ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతుందని చెప్పారు. ఆచరణ సాధ్యం కాని రీతిలో ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? అని ప్రశ్నించారు. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయన్న సామెతను గుర్తుచేశారు. ‘ఇన్ని ఉచిత పథకాలు అమలు చేస్తూ పోతే కుబేరుడు అయినా పనికి ఆహార పథకం కింద కూలీకి వెళ్లాల్సిందే’ అని ఎద్దేవాచేశారు. ‘అప్పు చేసి ఎవరైనా బెంజ్ కారు కొంటారా? ఎర్రబస్సులో వెళ్లే వాళ్లు ఎయిర్ బస్సులో వెళ్తామంటే ఆ కుటుంబం ఎంతకాలం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది? ఆ కుటుంబం ఎంత కాలం నిలబడుతుంది?’ అని ప్రశ్నించారు.
‘ఉచిత పథకాలను అర్హులకు మాత్రమే అమలుచేయాలి. అనర్హులకు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.03 కోట్ల కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తుంటే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారు?’ అని న్యాయమూర్తి నిలదీశారు. ఉచిత పథకాల అమలు ఎంతవరకు సాధ్యమో ప్రభుత్వాలే తెలుసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దారి తప్పే పరిస్థితి నెలకొన్నదని హెచ్చరించారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జనాకర్షణ పథకాలు అమలు చేయడంతో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని, ఇందుకు అధికారులు జవాబు చెప్పలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత కేసులో కంటోన్మెంట్ బోర్డుకు చెల్లింపులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.
ఉచిత పథకాల కింద వచ్చే సొమ్ములతో కొందరు కాలుమీద కాలు వేసుకొని బతుకుతుంటే, ఉద్యోగులు కూడా ఉద్యోగాలు మానేసి ‘మాకు ఉచిత పథకాలు కావాలి’ అని అడిగే ప్రమాదం పొంచి ఉన్నది. ఉచితాలపై ఆధారపడే మనస్తత్వం పెరిగితే సమాజం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
-హైకోర్టు జస్టిస్ నగేశ్ భీమపాక