మెదక్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జాతీయ లోక్ అదాలత్ లో మెదక్ జిల్లాలో పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో మొత్తం 5,254 కేసులకు పరిష్కారం చేశామని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. శనివారం రాత్రి వరకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో సీఎం 3,984 డీడీ కేసులు, 538 ఐపీసీ కేసులు, 732 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. సైబర్ నేరాల బాధితులకు ఊరట కల్పించేలా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో 14 సైబర్ క్రైమ్ కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకు రూ.20 లక్షల 27 వేల నగదును బాధితులకు రీఫండ్ చేసినట్లు పేర్కొన్నారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కేసుల పరిష్కారంలో కోర్టు డ్యూటీ అధికారులు, దర్యాప్తు అధికారులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేసి విశేష కృషి చేశారని ఎస్పీ అభినందించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన న్యాయపరమైన చర్యలను సమర్థవంతంగా పూర్తి చేసిన అధికారులను ప్రశంసించారు.
ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో జాతీయ లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని త్వరితగతిన న్యాయం పొందాలని ప్రజలకు సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు.