– ఎస్ఏ–1 పరీక్షల నిర్వహణ పరిశీలన
– ప్రీ-ప్రైమరీ చిన్నారులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనంపై ఆరా
జూలూరుపాడు, అక్టోబర్ 05 : విద్యార్థుల అభ్యసనకు అనుకూలమైన వాతావరణాన్ని పాఠశాలల్లో కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహారంపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, పోషకాహారం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఏ–1 పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు. వివిధ తరగతుల విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించడంతో పాటు ప్రశ్నపత్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల అభ్యసన స్థాయి తదితర వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
పాఠశాలలో మొత్తం 73 మంది విద్యార్థులు ఉండగా, 62 మంది హాజరైనట్లు ఉపాధ్యాయులు కలెక్టర్కు వివరించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుని, వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలోని మౌలిక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. మన ఊరు–మన బడి కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చేపట్టిన పనులు, వాటి ప్రస్తుత పరిస్థితి, వాటి ద్వారా విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు. పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రీ-ప్రైమరీ తరగతులను సందర్శించారు. చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించిన ఆయన, వారికి నూతనంగా అందించనున్న ఏకరూప దుస్తులను పరిశీలించారు. వారి వయస్సుకు అనుగుణంగా విద్యాబోధన జరుగుతున్న తీరును, అభ్యసన వాతావరణాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు ఆటల ద్వారా ఉల్లాసంగా నేర్చుకునేలా తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన బొమ్మలు, ఆట వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, ఆటలు, బొమ్మలు, ఇతర అభ్యసన సామగ్రిని వినియోగిస్తూ వారిలో ఆసక్తిని పెంపొందించాలని సూచించారు.

విద్యార్థుల అభ్యసనకు అనుకూల వాతావరణం కల్పించాలి : కలెక్టర్ అంకిత్
విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారంపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఉదయం 11 గంటలకు రాగిజావ, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు. మధ్యాహ్న భోజన పథకం కింద అందిస్తున్న ఆహారం నాణ్యత, మెనూ, వినియోగిస్తున్న ఆహార పదార్థాలు, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను వంట నిర్వాహకురాలిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థుల అభ్యసనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వారి హాజరు, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహారంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట తాసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ జుంకీలాల్, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.