– దొంగరి కుటుంబానికి డీఈఓ శ్రీనివాస్‌రావు అభినందనలు
పెన్‌పహాడ్, అక్టోబరు 05 : తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.21 లక్షలు వెచ్చించి రెండు అదనపు తరగతి గదులు నిర్మించిన దొంగరి మురళి కుటుంబం సేవాభావం అభినందనీయమని సూర్యాపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రావు కొనియాడారు. పెన్‌పహాడ్ మండలంలోని దోసపహాడ్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను సోమవారం డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన దొంగరి కుటుంబం మరెందరికో ఆదర్శమని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న బడికి తిరిగి సేవ చేయడం గొప్ప విషయమన్నారు. దొంగరి మురళి కుటుంబం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో రూ.21 లక్షలతో తరగతి గదులు నిర్మించడం అభినందనీయమన్నారు.
అంతేకాకుండా పాఠశాల అభివృద్ధికి మరో కొంత మంది దాతలు ముందుకువచ్చి మరో రూ.20 లక్షలు అందించడం సంతోషకరమన్నారు. అదనపు తరగతి గదులతో పాటు కళావేదిక, శుద్ధి చేసిన తాగునీటి ప్లాంట్, సీసీ కెమెరాలు, స్మార్ట్ టీవీ, క్రీడా సామగ్రి తదితర సదుపాయాలు కల్పించడాన్ని డీఈఓ అభినందించారు. ఇలాంటి దాతృత్వం మరిన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వలపట్ల సైదమ్మా లింగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిండిగి నర్సయ్య, ఉపాధ్యాయులు మామిడి వెంకన్న, కళ్యాణి, విజయ కుమారి వెంకన్న, విప్లవ కుమార్, దాత దొంగరి మురళి కుటుంబ సభ్యులు, ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త అందె సత్యం, అవంతిక, ఎంపీడీఓ జానయ్య, ఎంఈఓ నకిరేకంటి రవి, గద్దల నాగయ్య, సత్యవతి వెంకటమ్మ, పూర్వ విద్యార్థులు, దాతలు పాల్గొన్నారు.