– సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
పెన్పహాడ్, అక్టోబర్ 05 : రైతులకు అండగా నిలుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నట్టేట ముంచుతున్నదని, కరెంట్ కోతలతో చుక్కలు చూపిస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 8 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం పెన్పహాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెన్పహాడ్ 33/11 KV సబ్ స్టేషన్ ముందు ఆందోళన బాటపట్టి రోడ్డెక్కారు. సబ్స్టేషన్లను ముట్టడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి, పార్టీ రాష్ట్ర నాయకుడు బసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు దొంగరి యూగేందర్. మాజీ ఎంపీపీ నెమ్మది భిక్షం పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిందని, ఇప్పుడెందుకు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.
ఓ వైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి సాగునీరు అందుబాటులో లేదని, మరోవైపు కరెంట్ కోతల కారణంగా పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొంటూ సిబ్బందిపై మండిపడ్డారు. రెక్కలు ముకలు చేసుకుని సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చెర్మన్ వెన్న సీతారాం రెడ్డి, నాయకులు తూముల ఇంద్రసేనరావు, మిర్యాల వెంకటేశ్వర్లు, పొదిలా నాగార్జున, దంతాల వెంకటేశ్వర్లు, చెన్నూ శ్రీనివాస్ రెడ్డి, నెమ్మది నగేశ్, గట్టు కొండా గణేష్, బొల్లాక బొబ్బయ్య, మామిడి పరందములు, భూక్య సైదా నాయక్, బొల్లేదు వినోద్, షేక్.షరీఫ్, ఒగ్గు గోపి, కొండేటి సతీష్, జినుకల నాగార్జున, మచ్చ శ్రీను, మామిడి నాగయ్య, భూక్య నాగు నాయక్, కాకనూరి నాగరాజు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.