Umesh Yadav : భారత జట్టుకు దూరమైన పేసర్ ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఉమేశ్ పద్దెనిమిదేళ్ల బంధానికి వీడ్కోలు పలికాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం నుంచి విదర్భ (Vidarbha)కు ప్రాతినిధ్యం వహించిన అతడు.. దేశవాళీ సీజన్ 2026-27కు ముందే కొత్త జట్టు మారాడు. ఇన్నాళ్లు ప్రధాన బౌలర్‌గా విదర్భ విజయాల్లో కీలకైమన ఈ పొడగరి స్పీడ్‌స్టర్ పంజాబ్ గూటికి చేరాడు.
దేశవాళీ సీజన్లో 2026-27కు ముందే విదర్భకు షాకిచ్చాడు భారత పేసర్ ఉమేశ్ యాదవ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం నుంచి ఆ జట్టుకు ఆడుతున్న అతడు 18 ఏళ్ల తర్వాత పంజాబ్‌కు మారాడు. ఈ విషయాన్ని అతడు సోమవారం ధ్రువీకరించాడు. ‘అవును.. పంజాబ్ క్రికెట్‌తో ఒప్పందం చేసుకున్నా. వారి జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు పంజాబ్ క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు. దేశవాళీలో మెరుగైన ప్రదర్శన చేస్తున్న పెద్ద జట్టు కోసం వెతికా. నేను ఆడుతున్న విదర్భ కూడా మంచి జట్టే. అందులో సందేహం లేదు.
Umesh Yadav moves to Punjab for the 2026-27 season after 18 years with Vidarbha
Read more: https://t.co/jnhurW5Pbf https://t.co/jwlGD4CIS7
— Cricinfo (@cricinfo) October 5, 2026
ఒకవేళ విదర్భను విడిచిపెడితే ఉమేశ్ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న జట్లకు ఆడాల్సిందే అని కొందరు మాట్లాడుకోవడం వినిపించింది. అందుకని.. పటిష్టమైన, గొప్పగా ఆడుతున్న జట్టుకు మారాలనుకున్నా’ అని ఉమేశ్ వెల్లడించాడు. అనుభవజ్ఞుడైన ఉమేశ్ పంజాబ్‌కు రావడాన్ని కోచ్ అమిత్ ఉనియల్ స్వాగతించాడు.
‘ఈసారి రెడ్ బాల్ క్రికెట్లో మరింత మెరుగవ్వాలి. అందుకు 20 వికెట్లు తీయగలిగిన బౌలర్లు కావాలి. ఈ కోణంలో ముందుకెళ్తున్న మాకు ఉమేశ్ దొరికాడు’ అని అమిత్ పేర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2008లో అడుగుపెట్టిన ఉమేశ్ విదర్భ తరఫున 124 మ్యాచ్‌ల్లో 380 వికెట్లు తీశాడు. అయితే.. ఈ వెటరన్ పేసర్ చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతోంది. దేశవాళీలో నిలకడగా రాణించిన అతడు 2010లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. తొలుత వన్డేల్లో, ఆపై టెస్టులకు ఎంపికైన అతడు 57 మ్యాచుల్లో 170 వికెట్లు పడగొట్టాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్ మాదిరిగానే ఉమేశ్ సైతం టీమిండియాకు దూరమై మూడేళ్లు దాటింది.