హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మలేషియాలోని కౌలాలంపూర్లో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించబోయే సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ చాంపియన్షిప్-2026 పోటీలకు బీసీ గురుకుల విద్యార్థులు గోపిక, సంగీత ఎంపికయ్యారు. గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర, దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటే పోటీలో బీసీ గురుకుల విద్యార్థులు పాల్గొననుండడంపై హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులు గోపిక, సంగీత ఇటీవల కర్నూలు, చెన్నైలో జరిగిన సౌత్ జోన్ చాంపియన్షిప్ పోటీలో పాల్గొని బంగారు పతకం, ఆగ్రా, జమ్ముకాశ్మీర్లో జరిగిన పోటీలో పాల్గొని అత్యున్నత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. పోటీలకు ఎంపికైన విద్యార్థులను, ఫిజికల్ డైరెక్టర్స్ అంజలి, మమత, శోభ, లాక్రోస్ క్రీడా కోచ్ శివకుమార్, ఆకాష్, ప్రిన్సిపాల్ శ్రీలతను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్ బాల మాయాదేవి, కార్యదర్శి బడు సైదులు ప్రత్యేకంగా అభినందించారు.