Home Guards | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని హోంగార్డులకు ఈ నెల కూడా వేతనాలు ఆలస్యం కానున్నాయి. ఈ మేరకు వారిని ప్రభుత్వం ఇప్పటినుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నది. నిత్యం గొడ్డుచాకిరీ చేస్తున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని హోంగార్డులు మండిపడుతున్నా రు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెలా మొదటి వారంలోనే వేతనాలు అందేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఆ పరిస్థితి మారిపోయింది. ప్రతి నెలా 10వ తేదీ తర్వాతే హోంగార్డుల ఖాతాల్లో వేతనాలు పడుతున్నాయి.
గత ఐదారు నెలలుగా 13-15వ తేదీ తర్వాతనే వేతనాలు పడ్డాయి. తాజాగా ఇప్పుడు ఈ నెల వేతనం మరింత ఆలస్యంగా రాబోతున్నట్టు ఉన్నధికారులు చెప్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నుంచి హోంగార్డుల వాట్సాప్ గ్రూపుల్లో ఆర్ఐలు ఓ సందేశాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ‘సీపీ, హోంగార్డ్ కమాండెంట్ ఉత్తర్వుల ప్రకారం.. కాలం నంబర్ 27పై ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతున్నందున ఈ నెలలో హోంగార్డులకు వేతనాల చెల్లింపు ఆలస్యం కానున్నట్టు తెలుస్తున్నది. కావున అందరూ మానసికంగా, ఆర్థికంగా వెసులుబాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. దీనిపై హోంగార్డులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రజాపాలనలో రోజుల తరబడి
కాంగ్రెస్ హయాంలో జీతం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు దాపురించాయని హోంగార్డులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో తమ వేతనం బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో చెక్కులు అవుతున్నాయని, ఫలితంగా ఈఎంఐల గడువు ముగిసి సిబిల్ స్కోర్ తగ్గిపోతున్నదని బాధపడుతున్నారు. వేతనాల చెల్లింపులో జాప్యం వల్ల ఇంటి ఖర్చులకు ఇబ్బంది పడాల్సి వస్తున్నదని, లోన్లు రాక, సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు, ఇతర ఈఎంఐలు చెల్లించలేక ప్రతినెలా నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. చిన్న ఉద్యోగులమైన తమకు సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. వేతనాల కోసం అధికారులను అడిగితే ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.