హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ల ప్రక్రియను చేపడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత లేనివారికి టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు కుట్ర చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకం అమలులో భాగంగా ఈ ఏడాది రూ.123 కోట్లతో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీకి టెండర్లను ఆహ్వానిస్తూ ఆగస్టు 18న మత్స్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, గతంలో చేపపిల్లలు పంపిణీ చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇంకా బిల్లులు చెల్లించకపోవడంతో ఈసారి టెండర్లు
వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం గడువును పొడిగించి, రెండోసారి టెండర్ల పిలవడంతో కేవలం 11 జిల్లాలకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడినట్టు గుర్తించిన అధికారులు.. ఆ బిడ్లను రద్దుచేసి, మళ్లీ టెండర్లు పిలిచారు. దీంతో ఎట్టకేలకు సెప్టెంబర్ 12 నాటికి 80 టెండర్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం వీటిలో 64 టెండర్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ, వీటిలో తుది దశ పక్రియలో ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. చేప పిల్లలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు తప్పనిసరిగా వాటిని ఉత్పత్తి చేసే చెరువులు ఉండాలి. కానీ, టెండర్లు వేసినవారిలో చాలా మందికి చేపల పెంపకం చెరువులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి వారికే కాంట్రాక్టులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు మత్స్యకార సొసైటీ ప్రతినిధులు అనుమానిస్తున్నారు. చేపపిల్లలను పంపిణీ చేసే కాంట్రాక్టరుకు వాటిని ఉత్పత్తి చేసే చెరువు ఉన్నదో లేదో పరిశీలించాల్సిన మత్స్య, రెవెన్యూ శాఖల అధికారులు.. నామమాత్రపు పరిశీలనతో సరిపెట్టారన్న ఆరోపణలున్నాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 35-40 ఎంఎం, 80-100 సైజు చేపపిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. వారితో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాక మత్స్యకార సొసైటీల ద్వారా జలాశయాల్లో చేపపిల్లలను వదలనున్నారు. ఈ ప్రక్రియ మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.