హైదరాబాద్, జూన్30 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న నీటిలభ్యతపై లెక్కలు తీసేందుకు కేంద్రం మరోసారి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఆయా బేసిన్ల పరిధిలోని రాష్ర్టాలకు ఇదే విషయమై తాజాగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) లేఖలు రాసింది. ఏపీ చేపట్టనున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులిచ్చే నేపథ్యంలోనే కేంద్రం ఆదేశాల మేరకు తాజాగా మరోసారి లెక్కలు తీసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. గోదావరి బేసిన్లో నీటిలభ్యతపై 2021లోనే ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనం చేసింది. కేంద్ర జలసంఘం సైతం గతంలోనే ప్రత్యేకంగా స్టడీ చేసింది.
గోదావరిలో మిగులు జలాలు లేవని ఆయా అధ్యయనాలు తేల్చాయి. ఆ గణాంకాలపై బేసిన్‌లోని రాష్ర్టాలు, మరీ ముఖ్యంగా ఏపీ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నది. తాజాగా ఏపీ సర్కార్ 200 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు లింకు ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దానిని జీసీ (గోదావరి-కావేరి) లింకు ప్రాజెక్టులో చేపట్టేందుకు కేంద్రం సైతం సమాలోచనలు చేస్తున్నది. రాష్ర్టాలతో చర్చలు కొనసాగిస్తున్నది.
ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యతపై రాష్ర్టాలు అనేక వాదనలు వినిపిస్తున్నాయి. పలు కేంద్ర సంస్థలు సైతం అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. గోదావరి నదిలో నీటి లభ్యత గణాంకాలను సమగ్రమైన, శాస్త్రీయ పద్ధతిలో సేకరించాలని, ఆ తర్వాతే నదుల అనుసంధానంపై దృష్టి సారించాలని స్పష్టంచేస్తునాయి. గోదావరిలో నీటి లభ్యత ఎంత ఉన్నది? ట్రిబ్యునల్ ఆయా రాష్ర్టాలకు ఇప్పటికే చేసిన నీటి కేటాయింపులను మినహాయించగా అందుబాటులో ఉండే అదనపు జలాలు ఎన్ని? వాటిని వినియోగించుకోవచ్చా? లేదా? దానిపై కేంద్రానికి స్పష్టత ఉన్నదా? లేదా? అనే అంశాలపై అధ్యయనం జరుగాల్సి ఉన్నదని డిమాండ్ చేస్తున్నాయి.
గోదావరిలో మిగుల జలాలను ఎలా నిర్ధారించారు? వాటిని జీడబ్ల్యూడీటీ (గోదావరి జలవివాదాల ట్రిబ్యునల్) గుర్తించిందా? అవార్డులో పరిగణనలోకి తీసుకున్నదా? పోలవరం వద్ద 129 రోజులపాటు వరద ప్రవాహం కొనసాగుతుందా?, ఇంద్రావతి (జీ11), శబరి (జీ12), లోయర్ గోదావరి (10) సబ్ బేసిన్ల నుంచి నీటి లభ్యతపై అధ్యయనం చేయగా, ఆయా సబ్బేసిన్లలో మిగులు జలాలే లేవని బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ రిపోర్టులోనే ప్రాజెక్టు అధికారులు తేల్చిచెప్పారని సీడబ్ల్యూసీనే గతంలో వెల్లడించింది.
పోలవరం నుంచి గడచిన 15ఏండ్లుగా (2000-01-2014-15) నీటివిడుదల లెక్కలు, ఇతర ప్రాజెక్టుల నుంచి నీటివిడుదల గణాంకాలు, సాగునీటి వినియోగ లెక్కల ఆధారంగా గోదావరి నీటిమళ్లింపునకు లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలుపడమేగాక, ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, పూర్తయిన, ప్రణాళిక దశలో ప్రాజెక్టులకు సంబంధించి కచ్చితమైన నీటి కేటాయింపుల, వినియోగ లెక్కలను సమర్పించాలని, ఆయా ప్రాజెక్టుల ప్రణాళికల విశ్వసనీయతను తెలుపాలని ఏపీకి సీడబ్ల్యూసీ గతంలోనే సూచించింది.
అంతేకాదు ఆయా ప్రాజెక్టులను సూచించే మ్యాపులను అందించాలని వెల్లడించింది. అదేతరహాలో ప్రస్తుతం బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల నుంచి హైడ్రాలజీ స్టడీస్ డాటాను కేంద్రం కోరుతున్నది. కేంద్రం ఆదేశాల మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ఆ పనికి పూనుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బేసిన్‌లోని రాష్ర్టాలకు లేఖలు రాసినట్టు తెలిసింది. అటు కృష్ణాలోనూ ఉన్న నీటిలభ్యతపై సమగ్ర వివరాలు ఇవ్వాల్సిందిగా సభ్య రాష్ట్రాలను కోరినట్టు తెలుస్తున్నది. డాటా అప్డేట్ కోసమేనని ఎన్‌డబ్ల్యూడీఏ, కేంద్రం చెప్తున్నా, కేవలం ఏపీ చేపట్టిన బనకచర్ల లింకు ప్రాజెక్టు కోసమే ఈ కసరత్తుకు సిద్ధమైనట్టు ఇంజినీర్లు చెప్తున్నారు.