హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : దుంప పంటల సాగుతో దేశంలో పోషకాహార భద్రత సాధించవచ్చని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ దండ రాజిరెడ్డి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో దుంప కూరగాయలపై అఖిలభారత సమన్వయ పరిశోధన సదస్సును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులను తట్టుకోవడంతోపాటు రైతులకు అధిక ఆదాయాన్నిచ్చేందుకు దుంప పంటలు ఆశాజనకంగా ఉన్నట్టు తెలిపారు. ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్కుమార్సింగ్ మాట్లాడుతూ.. బయో ఫోర్టిఫైడ్ రకాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే మాట్లాడుతూ.. ప్రపంచంలో వరి, అపరాల తర్వాత ప్రధాన పంటల్లో దుంప పంటలు మూడో స్థానంలో ఉన్నట్టు చెప్పారు. జినోమిక్ రిసోర్సెస్పై పరిశోధనలు చేస్తే భవిష్యత్తులో దేశంలోని ఆహార అవసరాలను దుంపకూరలతో తీర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ పరిశోధన సంచాలకులు లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్ భగవాన్, అనితకుమారి, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.