శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 03:43:29

పీవీ మౌనం వెనుక అణు విస్ఫోటం

పీవీ మౌనం వెనుక అణు విస్ఫోటం

మౌనం ఆయన ఆభరణం.. మాట్లాడే మాట బంగారం.. వ్యక్తిత్వం ప్రత్యేకం.. అందుకే పీవీ నరసింహారావు మాటలో, చేసే పనిలో జాగ్రత్త కనిపిస్తుంది. ఏ పని చేసినా కొత్తదనం, ప్రయోగాత్మక విధానం కచ్చితంగా ఉంటుంది. తాను గొప్ప పనిచేసినా దాన్ని ప్రచారం చేసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినా ఏనాడూ ప్రచారం చేసుకోలేదు. అలాగే పోఖ్రాన్‌ అణు  పాటవ పరీక్షకు మూలకారకుడు పీవీనే. ఈ విషయాన్ని మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి స్వయంగా ప్రకటించారు. పీవీ నరసింహారావు కన్నుమూశాక ఓ సందర్భంలో ఈ నిజాన్ని ప్రపంచానికి చెప్పారు. భారతదేశ అణ్వస్త్ర పితామహుడు పీవీయేనని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయి, పీవీ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాజ్‌పేయి ప్రధాని పదవి చేపట్టారు. కొన్ని రోజులకు పీవీ కలిసి ‘సామగ్రి తయ్యార్‌ హై’ అని అన్నారు. అంటే.. అణ్వాస్త్రం సిద్ధంగా  ఉంది అని. దాన్ని తాను కేవలం పరీక్షించానని వాజ్‌పేయి వెల్లడించారు. వాస్తవానికి 1995 డిసెంబర్‌లో పీవీ హాయాంలోనే అణు పాటవ పరీక్షలు చేయాలనుకున్నా, రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో పరీక్షలకు సిద్ధం అవుతున్నట్టు అమెరికా శాటిలైట్లు గుర్తించాయి. ఆ దేశ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. బిల్‌ క్లింటనే స్వయంగా పీవీకి ఫోన్‌ చేసి అడగ్గా.. భారతదేశానికి ఆ సత్తా ఉన్నదని, అయితే ఇప్పుడు అణు పాటవ పరీక్ష నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. పరీక్షకు మాత్రం సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఆ తర్వాత మూడేండ్లకు పోఖ్రాన్‌ అణు పాటవ పరీక్ష చేశారు.


logo